ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం కాలం నాటి అభివృద్ధి, మత సామరస్యం, సంస్కృతులను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఆదివారం మైనారిటీస్ ఎంపవర్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో జరిగిన ‘మైనారిటీ సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిజాం పాలన స్వర్ణ యుగమని, వారి కాలంలో అభివృద్ధితో పాటు మత సామరస్యం వెల్లివిరిసిందని కొనియాడారు.
ఏడో నిజాం పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందేదని తెలిపారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీతో పాటు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమానంగా ఆర్థిక చేయూతనిచ్చిన ఘనత నిజాం నవాబుకే దక్కుతుందన్నారు. 14 ఏళ్ల టీఆర్‌ఎస్ ఉద్యమంలో ఒక్క ఆంధ్రుడికీ నష్టం జరగలేదన్నారు. ఒకప్పుడు తెలంగాణను ఏలిన ముస్లింలు ఇప్పుడు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషను బలవంతంగా రుద్ది, 55 వేల మంది ఉర్దూ భాష వచ్చిన ఉద్యోగులను తొలగించారన్నారు. అప్ప ట్లో ఉద్యోగాలలో ముస్లింలు 33 శాతం ఉండగా, ప్రస్తుతం ఒక్క శాతం కూడా లేరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 40 వేల మంది పేద ముస్లిం యువతులకు వివాహాలు జరిపిస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ లాంటి నేతను చూడలేదు: మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్
అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డ ముస్లింలకు చేయూతనిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఆయన చలవేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఖాజా మహ్మద్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు.
నిజాం పాలన స్వర్ణ యుగం
Published Mon, Sep 22 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement