Minority Conference
-
‘అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ రద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తామని ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ సుస్మితా దేవ్ చెప్పారు. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ మైనారిటీ విభాగం సదస్సులో మాట్లాడుతూ ముస్లిం పురుషులపై ముస్లిం మహిళలను ఈ బిల్లు ద్వారా రెచ్చగొట్టే వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు అమలైతే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెబుతున్నా ముస్లిం పురుషులను జైళ్లలో మగ్గేలా, వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల ఉద్యమం సాగించిన వేలాది ముస్లిం మహిళలను ఆమె అభినందించారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని తొలగిస్తుందని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. -
‘ఆయన ముఖంలో ఓటమి భయం కన్పిస్తోంది’
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ తాను దేశం కన్నా గొప్ప అనుకుంటోందని, మరో మూడు నెలల్లో తమ కంటే దేశమే ఉన్నతమైందని ఆ పార్టీకి అవగతమవుతుందని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మైనారిటీ విభాగం జాతీయ సదస్సును ఉద్దేశించి గురువారం రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌ను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పగ్గాలు మోదీ చేపట్టినట్టు కనిపిస్తున్నా రిమోట్ కంట్రోల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉంటుందన్నారు. రాబోయే మూడు నెలల్లో బీజేపీకి తన స్ధానమేమిటో దేశం చూపబోతోందని జోస్యం చెప్పారు. 2017 డోక్లాం ప్రతిష్టంభనను రాహుల్ ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ ఆయన చెప్పుకునేంత ధైర్యవంతుడేమీ కాదని చైనాకూ తెలిసివచ్చిందన్నారు. ప్రధాని మోదీ నేరుగా తనతో పదినిమిషాలు ఒకే వేదికపై చర్చకు వచ్చి తనతో ముఖాముఖి తలపడాలని రాహుల్ బీజేపీకి సవాల్ విసిరారు. -
మైనార్టీ సదస్సు పట్టని నేతలు
అధికార పార్టీ నేతలు జనసమీకరణను తుస్ మనిపించారు. ‘నారా హమారా. టీడీపీ హమారా’ పేరుతో తెలుగుదేశం పార్టీ గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభకు జిల్లా నుంచి జనసమీకరణ చేయటంలో ముఖ్య నేతలు పూర్తిగా విఫలమయ్యారు. పర్యావసానంగా వందల బస్సులు అని చెప్పి చివరకు పదుల సంఖ్యలో బస్సులు వెళ్లటం, దానిలో కూడా మైనార్టీలతో పాటు పార్టీ కార్యకర్తలు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మైనార్టీ సదస్సుకు జిల్లా నుంచి జనసమీకరణ, ఇతర బాధ్యతలు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో, మైనార్టీ ఓటింగ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యటించి అక్కడ సభ పోస్టర్ ఆవిష్కరణలు, సమావేశాలు నిర్వహించి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు వారం నుంచి సభకు తరలిరావాలని పిలుపునివ్వటంతో పాటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అయితే మంగళవారం మాత్రం ఆ మేరకు ఎక్కడా జనం కనిపించని పరిస్థితి. జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్టీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు అందరూ జనసమీకరణను పూర్తిగా గాలికొదిలేశారు. నెల్లూరు నగరం నుంచి మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బస్సులు రాకపోవటం గమనార్హం. ఇక జిల్లాలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాత్రం అట్టహసంగా నగరం నుంచే వందకు పైగా బస్సులు, జిల్లా నుంచి 235 బస్సులు ఏర్పాటు చేశామని ప్రకటించారు. తీరా జనాలు లేకపోవటంతో 50 బస్సులు కూడా పూర్తిగా వెళ్లని పరిస్థితి. జిల్లాలో మైనార్టీల ఓటింగ్ గణనీయంగా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌లో అధికంగా ఉండగా మిగిలిన నియోజకవర్గాలోనూ అధికంగా ప్రభావితం చేసే స్థాయిలో మైనార్టీల ఓటింగ్ ఉంది. ఈ క్రమంలో జిల్లా నుంచి కనీసం 10 వేల మందికి తక్కువ కాకుండా సభకు తరలించాలని పార్టీ రాష్ట్ర నేతల ఆదేశం. అయితే ఈ మేరకు నేతలు ప్రకటనలు చేసి హడావుడి చేశారు కానీ మైనార్టీలను పూర్తిస్థాయిలో రప్పించలేకపోయారు. మంగళవారం ఉదయం నగరంలో వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో బస్సులను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో సగం బస్సులు కూడా నిండని పరిస్థితి. దీంతో పదుల సంఖ్యలో బస్సులను డిపోలకు వెనక్కి పంపేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొన్ని బస్సులు కదలిని పరిస్థితి. మొత్తం మీద టీడీపీ మైనార్టీ సదస్సుకు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటం గమనార్హం. -
నిజాం పాలన స్వర్ణ యుగం
ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం కాలం నాటి అభివృద్ధి, మత సామరస్యం, సంస్కృతులను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఆదివారం మైనారిటీస్ ఎంపవర్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో జరిగిన ‘మైనారిటీ సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిజాం పాలన స్వర్ణ యుగమని, వారి కాలంలో అభివృద్ధితో పాటు మత సామరస్యం వెల్లివిరిసిందని కొనియాడారు. ఏడో నిజాం పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందేదని తెలిపారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీతో పాటు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమానంగా ఆర్థిక చేయూతనిచ్చిన ఘనత నిజాం నవాబుకే దక్కుతుందన్నారు. 14 ఏళ్ల టీఆర్ఎస్ ఉద్యమంలో ఒక్క ఆంధ్రుడికీ నష్టం జరగలేదన్నారు. ఒకప్పుడు తెలంగాణను ఏలిన ముస్లింలు ఇప్పుడు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషను బలవంతంగా రుద్ది, 55 వేల మంది ఉర్దూ భాష వచ్చిన ఉద్యోగులను తొలగించారన్నారు. అప్ప ట్లో ఉద్యోగాలలో ముస్లింలు 33 శాతం ఉండగా, ప్రస్తుతం ఒక్క శాతం కూడా లేరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 40 వేల మంది పేద ముస్లిం యువతులకు వివాహాలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ లాంటి నేతను చూడలేదు: మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డ ముస్లింలకు చేయూతనిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఆయన చలవేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఖాజా మహ్మద్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు.