గల్ఫ్ బాధితులను ఆదుకోరా?: సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో 6 వందల మంది గల్ఫ్‌లో చనిపోయారని, అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలేదని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందిస్తున్నట్టుగా ప్రకటించి ఏడాది దాటినా అతీగతీలేదన్నారు. పాలసీ పూర్తిచేయాలంటూ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇచ్చినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మూడేళ్లలో ఆరు వందల మంది గల్ఫ్‌లో చనిపోయారని, బాధితులకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సహాయం అందలేదని చెప్పారు. అక్కడ జైళ్లలో ఉన్న తెలంగాణవారికి న్యాయపరమైన సహాయం కూడా ప్రభుత్వం నుంచి అందించడంలేదని సురేశ్‌రెడ్డి విమర్శించారు.