ఓ యువకుని ఆలోచన అంపశయ్య | The idea of a young man ampasayya | Sakshi
Sakshi News home page

ఓ యువకుని ఆలోచన అంపశయ్య

Published Sun, Dec 20 2015 3:38 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

ఓ యువకుని  ఆలోచన  అంపశయ్య - Sakshi

ఓ యువకుని ఆలోచన అంపశయ్య

ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆనందాలు, ఆవేశాలు,  ఆవేదనలు.. అణువణువునా ఆక్రమించుకున్న యువకుడి మనసెంత అల్లకల్లోలం? ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో పీజీ చేసిన ఆ విద్యార్థి అంతరంగమే దానికి సాక్ష్యం. నవల పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సుప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన ఏళ్లనాటి కథను సాహసోపేతంగా తెరకెక్కిస్తున్నారు సిటీకి చెందిన దర్శకుడు ప్రభాకర్ జైని. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత ఓయూలో షూటింగ్ చేసిన ఈ ఏకైక చిత్రంలో సినీరంగానికి చెందని నగర ప్రముఖులూ పాలుపంచుకోవడం విశేషం.    
                                                 - ఎస్.సత్యబాబు
 
 
 ‘అమ్మా నీకు వందనం’ చిత్రం ద్వారా అద్దె తల్లుల (సరొగేట్ మదర్స్) హృదయ వేదనను తెరకెక్కించిన దర్శకుడు ప్రభాకర్ పలు పురస్కారాలు దక్కించుకున్నారు. ప్రభుత్వాధికారిగా పదవీ విరమణ చేసిన ఈయన తనకు ఎంత మాత్రం పరిచయం లేని సినీరంగాన్ని ఎంచుకోవడం మాత్రమే కాదు.. పూర్తి వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అదే కోవలో ప్రస్తుతం అంపశయ్యకి చిత్ర రూపమిస్తున్న ప్రభాకర్ జైని పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
 
 ఓయూలోని  హాస్టల్ గదిలో షూటింగ్..
 దశాబ్దాల క్రితం నాటి కథ ఇది. చాలా ప్రాచుర్యం పొందిన అంపశయ్య నవలను గతంలో పలువురు సినిమాగా రూపొందించాలనుకున్నా సాధ్యం కాలేదు.  అయితే యువకుడిగా ఉన్నప్పుడు ఈ నవల చదివి ఎంతో ప్రభావితమైన నేను ఎలాగైనా ఈ కథను తెరకెక్కించాలని చాలెంజ్‌గా తీసుకొని చిత్రం రూపొందించా. సిటీలోని పలు చోట్ల సినిమా షూటింగ్ చేశాం. గత 50 ఏళ్లలో లేని విధంగా ఓయూలో ఈ సినిమా షూటింగ్ చేయగలిగాం. కథకు అనుగుణంగా 1970 నాటి పరిస్థితులను యథాతథంగా పునఃప్రతిష్టించాం.
 
 సిటీ వేదికగా.. జాతీయ అవార్డు లక్ష్యంగా..
 అంపశయ్యలో అచ్చ తెలుగమ్మాయి, నగరవాసి పావని హీరోయిన్‌గా, శ్యామ్ హీరోగా నటించారు. పొట్టి శ్రీరాములు వర్సిటీలోని థియేటర్ ఆర్ట్స్ కోర్సు విద్యార్థులు పాత్రలు పోషించారు. ఐఏఎస్ అభ్యర్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు చెప్పే సిటీకి చెందిన ఆకెళ్ల రాఘవేంద్ర హీరోకి కర్తవ్య బోధ చేసే పాత్రలో సినీరంగానికి పరిచయమవుతున్నారు. తెలంగాణ ప్రజా కళాకారుడు కిన్నెర మొట్ల మొగిలయ్య కూడా ఒక పాటలో తొలిసారి కనిపించనున్నారు.
 
  స్వాతి నాయుడు, యోగి దివాన్, కమెడియన్‌గా రాధాకృష్ణ, వాల్మీకి (సాక్షి-పూరి జగన్నాథ్ షార్ట్ ఫిలిం పోటీ విజేత), మోడల్ మోనికా థాంప్సన్.. అలాగే మరికొందరు సినీ రంగానికి చెందిన నగరవాసులు ఈ సినిమాలో నటనతో పాటు పలు అంశాల్లో పాలుపంచుకున్నారు. కొన్ని పాత్రల్లో నేను, నా భార్య కూడా నటించాం. ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ దశలో ఉంది. కథ మీద ఉన్న నమ్మకంతో జాతీయ అవార్డు లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement