గంగమ్మ ఒడికి ఇలా..
18 గంటల 44 నిమిషాలు.. ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి పట్టిన సమయమిది. సోమవారం రాత్రి 11:59కి భక్తుల జయజయధ్వానాలతో కదిలిన గణనాథుడు మంగళవారం సాయంత్రం 6.44కి నిమజ్జనమయ్యాడు. దీంతో మహా ఘట్టానికి తెరపడింది. మునుపటితో పోలిస్తే నిమజ్జన యాత్ర ఈసారి సుదీర్ఘంగా సాగింది. ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 9 క్రేన్ల సాయంతో 6580 విగ్రహాలు నిమజ్జనమైనట్టు పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి షష్టిపూర్తి (ఉత్సవాలకు 60 ఏళ్లు) మహోత్సవం ఓ అద్భుత ఘట్టం. కైలాస విశ్వరూప మహాగణపతి విగ్రహ పనులు ప్రారంభమైన క్షణం నుంచి నిమజ్జనం వరకూ ప్రతి ఘట్టం అపురూపమే. ముఖ్యంగా మహాగణపతి నిమజ్జనోత్సవం దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాగణపతి నిష్ర్కమణ ప్రక్రియ ఏకబిగిన 18.44 గంటలపాటు సాగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం 6.44 గంటల వరకు యాత్ర కొనసాగింది. వేలాదిగా భక్తజనం వెంటరాగా గణేషుడు గంగమ్మ ఒడిలోకి జారుకున్నాడు.
- ఖైరతాబాద్
శోభాయాత్ర ఇలా..
సోమవారం రాత్రి 11.59 గంటలకు ముహూర్తం కోసం మహాగణపతి రథాన్ని కదిలించారు.
అర్ధరాత్రి 1.35: గంటలకు వాహనం కేవలం వందగజాల దూరం కదిలింది.
మంగళవారం ఉదయం 10.15 వరకు మహారథం అక్కడే ఉంది.
మధ్యాహ్నం: 12.05: రాజ్‌దూత్ చౌరస్తాకు చేరుకుంది.
టెలిఫోన్ భవన్: 12.20
సచివాలయం పాత గేటు: 12.55
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 50 నిమిషాలు పాటు తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద ఆగింది.
మధ్నాహ్నం 2.05 నిమిషాలకు కీలకమైన మలుపు
తెలుగుతల్లి చౌరస్తాను దాటింది.
తెలుగు తల్లి చౌరస్తా నుంచి సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో మహాగణపతి వాహనం ముందుకు సాగింది.
3.30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం 4 వద్దకు మహాగణపతి చేరుకున్నాడు.
4 గంటలకు పక్కనే ఉన్న మరో క్రేన్ సాయంతో దుర్గామాత విగ్రహాన్ని పైకి లేపారు.
4.10కి మహాగణపతికి కలశ పూజ నిర్వహించారు.
5.20 భారీక్రేన్ వైర్లను వాహనంపై ఉన్న మహాగణపతికి తగిలించి సిద్ధం చేశారు.
6.15 విశ్వరూపుడికి మహాహారతి సమర్పించారు.
6.20 వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి.
6.30 కైలాస విశ్వరూప మహాగణపతిని పైకి లేపారు.
6.44 జలప్రవేశం.
2012: రాత్రి 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు మధ్నాహం 2.22 గంటలకు జలప్రవేశం చేశాడు.
ఎన్నిగంటలు: సుమారు 7.30 గంటలు
2013: అర్ధరాత్రి 2.30కి బయల్దేరిన గణపయ్య
మధ్నాహ్నం 1.53కు గంగఒడికి చేరాడు.
ఎన్నిగంటలు: సుమారు 11.30 గంటలు
2014: అర్ధరాత్రి 11:59 కదిలి సాయంత్రం 6.44 గంటలకు గంగఒడికి చేరాడు.
ఎన్నిగంటలు: సుమారు 18.45 గంటలు
తొలిసారి నిమజ్జన పూజల్లో రాజేంద్రన్...
అధ్భుత సృజనతో గణనాథుడి ఆకృతికి రూపమిచ్చిన ప్రధాన శిల్పి రాజేంద్రన్ ఈ ఏడాది నిమజ్జన పూజల్లో పాల్గొనడం విశేషం. విగ్రహం తయారీ మొదలైన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన నిమజ్జనయాత్రలో పాల్గొనలేదు. విగ్రహాన్ని రథంపై ఉంచిన మరుక్షణం ఆయన ఇంటికెళ్లిపోతారు. కానీ ఈ ఏడాది మాత్రం తెలుగుతల్లి చౌరస్తా నుంచి నిమజ్జన యాత్రలో పాల్గొన్నారు. గణపయ్యకు మహాహరతి సమర్పించిన వెంటనే ఒంటరిగా ఇంటి బాటపట్టారు.
భారీగా భక్తజనం
సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు మహాగణపతి శోభా యాత్రను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఖైరతాబాద్ వీధుల్లో బారులు తీరారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఐమాక్స్ చౌరస్తా, మింట్ కాంపౌండ్, సచివాలయం ప్రాంతాలన్నీ జనసంద్రమయ్యాయి.