కృష్ణావతరణం | The third phase of the Krishna waters to the Greater hyderbad | Sakshi
Sakshi News home page

కృష్ణావతరణం

Published Tue, Feb 17 2015 12:18 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

కృష్ణావతరణం - Sakshi

కృష్ణావతరణం

గ్రేటర్‌కు మూడో దశ కృష్ణా జలాలు
ట్రయల్ రన్ విజయవంతం
మరో 15 రోజుల్లో 11.5 ఎంజీడీల నీరు
నాలుగో దశ ప్రతిపాదనలు సిద్ధం
 

కృష్ణావతరణానికి సమయం ఆసన్నమైంది. మహా నగర దాహార్తిని తీర్చేందుకు కృష్ణమ్మ సిద్ధమవుతోంది. మరో పక్షం రోజుల్లో గ్రేటర్ వాసుల ముంగిట్లో పొంగిపొర్లనుంది. కృష్ణా మూడో దశలో నగరానికి 11.5 ఎంజీడీల నీటిని తరలించే క్రమంలో... సోమవారం అధికారులు    నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతమైంది.
 
సిటీబ్యూరో: గ్రేటర్‌కు మరో పది పదిహేను రోజుల్లో అదనంగా 11.5 ఎంజీడీల కృష్ణా జలాలు రానున్నాయి. కృష్ణా మూడో దశ ప్రాజెక్టు ట్రయల్ రన్ (ప్రయోగ పరీక్ష) సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా కోదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఒక మోటారును ప్రారంభించి... 11.5 మిలియన్ గ్యాలన్ల నీటిని మూడోదశ పైపులైన్లలోకి పంపింగ్ చేశారు. పైప్‌లైన్లలో లీకేజీల గుర్తింపు, రిజర్వాయర్ సామర్థ్యం, కంప్రెషర్స్, ఎయిర్ వాల్వ్‌లు, మోటార్ల పని తీరు, వాటి సాంకేతికతలను పరీక్షించామని, ట్రయల్న్ ్రవిజయవంతంగా పూర్తయిందని జలమండలి వర్గాలు తెలిపాయి. మరో పది, పదిహేను రోజుల్లో మూడో దశ పైప్‌లైన్‌తో  11.5 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర శివార్లలోని సాహెబ్‌నగర్ రిజర్వాయర్‌కు తరలిస్తామని వెల్లడించాయి.
 
శివారు దాహార్తి తీర్చాలని...

ఈ ప్రాజెక్టును మార్చి 31లోగా పూర్తి చేసి.. నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తామని సంబంధిత అధికారులు చెప్పారు. ప్రస్తుతం కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా నగరానికి నిత్యం 180 ఎంజీడీల నీటిని తరలిస్తున్న విషయం విదితమే. మూడోదశను రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో ఏడాదిన్నర క్రితం చేపట్టారు. హడ్కో నుంచి సేకరించిన రూ.1500 కోట్ల రుణంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.170 కోట్లు ఈ పథకానికి వెచ్చించనున్నాయి. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి సాహెబ్‌నగర్ వరకు భారీ మంచినీటి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ నీటితో గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపాల్టీల్లో రాబోయే వేసవిలో దాహార్తి తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు చివరికి గోదావరి మొదటి దశ  పూర్తి చేసి... మరో 172 ఎంజీడీల జలాలను తరలిస్తామని... దీంతో శివారు మున్సిపాల్టీలలో దాహార్తి పూర్తిగా తీరుతుందని జలమండలి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
 
నాలుగో దశకు సిద్ధం

గ్రేటర్ జనాభా 2021 నాటికి 1.93 కోట్లకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి గ్రేటర్‌కు 170 ఎంజీడీల నీటిని తరలించేందుకు ఉద్దేశించిన కృష్ణా నాలుగో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలను జలమండలి సిద్ధం చేసింది. సుమారు రూ.2,880 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. మూడు దశల పంపింగ్ ద్వారా నగరానికి నీటిని తరలించేందుకు రెండు మార్గాలను ప్రతిపాదించింది. ఇవి ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్నాయి. ఆయన ఆమోదం లభిస్తే నాలుగో దశ ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది.

గ్రేటర్ మంచినీటి ముఖచిత్రం ..

ప్రస్తుతం గ్రేటర్‌లో 20 లక్షల భవంతులు ఉన్నాయి. జలమండలి కేవలం 8.64 లక్షల కుళాయిలకు నిత్యం 340 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. ఇందులో 25 ఎంజీడీలు ఉస్మాన్ సాగర్  నుంచి, మరో 15 ఎంజీడీలు హిమాయత్‌సాగర్ నుంచి సేకరిస్తోంది.  సింగూరు జలాశయం నుంచి 75 ఎంజీడీలు, మంజీర  నుంచి 45 ఎంజీడీలు, కృష్ణా మొదటి, రెండో దశల  ద్వారా మరో 180 ఎంజీడీలు ..ఇలా మొత్తంగా 340 ఎంజీడీల నీటిని తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేస్తోంది.
 
 
కృష్ణా, గోదావరి మంచినీటి పథకాల స్వరూపం
 

 ప్రాజెక్టు దశలు    గ్రేటర్‌కునీటి తరలింపు    పూర్తయిన  (మిలియన్ గ్యాలన్లలో)    సంవత్సరం        
కృష్ణా మొదటి దశ         90                                1996
కృష్ణా రెండోదశ             90                                2006
కృష్ణా మూడో దశ          90                               2015 మార్చికి పూర్తి.
కృష్ణా నాలుగోదశ          170                            ప్రభుత్వ పరిశీలనలోని పథకం
గోదావరి మొదటి దశ      172                            2015 ఆగస్టుకు పూర్తి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement