
‘చిలకలగూడ స్నాచర్లు’ చిక్కారు
జిమ్‌లో జత కట్టిన స్నాచర్ల ద్వయం
విలాసాల కోసం చోరీల బాట
అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్
సిటీబ్యూరో: నార్త్‌జోన్‌లోని చిలకలగూడ ఠాణా పరిధిలో గత గురువారం ఓ వృద్ధురాలి మెడ నుంచి బంగారం గొలుసు లాక్కుపోయిన స్నాచర్లను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల్లో చిక్కిన ఆనవాళ్ళ ఆధారంగా వీరిని పట్టుకున్నామని, నిందితులపై గతంలో ఎలాంటి కేసు లేవని డీసీపీ బి.లింబారెడ్డి గురువారం తెలిపారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రహమత్ పదో తరగతి వరకు చదివి వేనుభానగర్‌లో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ముషీరాబాద్ హరినగర్‌కు చెందిన మహ్మద్ జఫార్ మేధి బాకారంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో బుక్ బైండింగ్ పని చేస్తున్నాడు. జిమ్‌కు వెళ్ళే వీరిద్దరికీ అక్కడే పరిచయమైంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంతో పాటు విలాసాలకు డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి స్నాచింగ్స్ చేయాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ పరిసరాల్లో బైక్‌పై తిరుగుతూ కొన్ని రోజులుగా టార్గెట్ల కోసం వెతికారు. గత గురువారం నామాలగుండ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు నాగలక్ష్మమ్మ మెడలో ఉన్న 3 తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. ఆ సమయంలో జఫార్ బైక్ నడపగా... రహమత్ వెనుక కూర్చుని వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాగేశాడు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాల పుటేజీ ఆ«ధారంగా నిందితుల్ని గుర్తించారు. గురువారం ఇన్‌స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్ని చోరీ సొత్తును విక్రయించడానికి వచ్చిన నిందితుల్ని పట్టుకున్నారు. వీరి నుంచి బంగారు గొలుసు, వాహనంతో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.