Task Force Team
-
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
రూ.12.5 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం
చిత్తూరు అర్బన్/తిరుపతి అర్బన్: చిత్తూరు జిల్లా పోలీసులు భారీ ఎత్తున రూ.12.5 కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన ‘ఆపరేషన్ రెడ్’లో భాగంగా రూ.10 కోట్ల విలువైన దుంగలను స్వాధీనం చేసుకోగా, సదాశివకోన ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ బృందం రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహించి రూ.2.5 కోట్లు విలువ చేసే దుంగలను స్వాధీనం చేసుకుంది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను నరికి తమిళనాడుకు.. అటు నుంచి విదేశాలకు తరలించేందుకు యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను గురువారం చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్, టాస్క్‌పోర్స్ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు. గుడిపాల వద్ద బుధవారం వాహనాలు తనిఖీచేస్తున్న పోలీసులు.. ఓ వాహనంలో ఆరు ఎర్రచందనం దుంగలను గుర్తించి సీజ్ చేశారు. చిత్తూరుకు చెందిన పి.నాగరాజు, తమిళనాడుకు చెందిన ఎ.రామరాజు, జి.ప్రభు, ఎస్.విజయ్‌కుమార్, ఎ.సంపత్, కె.అప్పాసామి, కె.దొరరాజ్‌లను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారంతో తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబత్తూరులో ఆపరేషన్ రెడ్ నిర్వహించారు. వలర్పురం వద్ద ఓ గోదాములో దాచిన రూ.10 కోట్లు విలువ చేసే 353 ఎర్రచందనం దుంగలను, వాహనాలను సీజ్ చేశారు. కేసులో మరికొందర్ని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. ఇదిలా ఉండగా వడమాలపేట, ఏర్పేడు మండలాల్లో విస్తరించి ఉన్న సదాశివకోన ప్రాంతంలో రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహించి 8 చోట్ల రూ.2.5 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. స్మగ్లర్లు, కూలీలు తమిళనాడుకు చెందినవారని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
పొలిటీషియన్లే ఇతడి టార్గెట్!
-
పొలిటీషియన్లే ఇతడి టార్గెట్!
సాక్షి, హైదరాబాద్: అతడు పుట్టింది తూర్పుగోదావరి జిల్లాలో.. కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాల్లో పని చేశాడు.. గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు.. అతడు టార్గెట్ చేసింది మాత్రం రాజకీయ నాయకుల్నే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన తదితర పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు.. ఏపీ, తెలంగాణల్లోని 29 పోలీస్స్టేషన్లలో ఇతడిపై కేసులున్నాయి. ఇప్పటి వరకు 19 సార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు(40) నేర చరిత్ర ఇదీ. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత నుంచి రూ.10 లక్షలు కాజేసిన కేసులో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బాలాజీ చిక్కినట్లు డీసీపీ పి.రాధాకిషన్ రావు బుధవారం వెల్లడించారు. బీటెక్ చదివి.. ఏసీబీకి చిక్కి.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీ బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుం డం, పాల్వంచ, విశాఖల్లో పని చేశాడు. అప్ప టి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుం టూ ఏసీబీకి చిక్కాడు. కేసు నిరూపితం కావ డంతో ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైల్లో నేరగాళ్లతో ఏర్పడిన పరిచయాలతో మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకున్నాడు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ నంబర్లు.. బీఎస్ఎన్ఎల్ ఎంక్వైరీ నంబర్ ద్వారా ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్ చేశాడు. తాను రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్ట్ డైరెక్టర్‌నంటూ వారి పీఏలకు చెప్పి ఒక్కో అభ్యర్థికీ రూ.1,060 చొప్పున డిపాజిట్ చేయాలంటూ బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశాడు. బీజేపీ నాయకుడు రాంజగదీష్ ఫిర్యాదుతో పోలీసులు 2013లో అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన బాలాజీ అప్పటి ఎంపీలు వీహెచ్, దేవేందర్‌గౌడ్, పాల్వాయిలను టార్గెట్ చేశాడు. వారితో పాటు వారి పీఏలకూ ఫోన్లు చేసి యువకిరణాల ద్వారా ఉద్యోగాల పేరు చెప్పాడు. వీరి నుంచి రూ.3.07 లక్షలు స్వాహా చేశాడు. తానే ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా అరెస్టయ్యాడు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీని.. హైదరాబాద్ పోలీసులు గత జనవరిలో బాలాజీపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉండి ఈ ఏడాది జనవరిలో విడుదలైన బాలాజీ సెప్టెంబర్ 12న ఎమ్మెల్సీ ఆకుల లలితకు కాల్ చేసి తాను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ముందుగా 5శాతం చెల్లిస్తే ఆ మొత్తం విడుదల చేయిస్తానని చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించారు. మోసపోయానని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం బాలాజీని పట్టుకుంది. ఒక్కోసారి ఒక్కోలా.. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయని, మీ నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాల్సిందిగా మీమీ ఎమ్మెల్యేలకు సూచించాలంటూ ఎర వేశాడు. డిపాజిట్ పేరుతో కొంత మొత్తం బ్యాంకు ఖాతాలో వేయించుకుని మోసం చేశాడు. ఈ నేరంపై విజయనగరం రెండో టౌన్ పోలీసులు 2009లో బాలాజీని అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్లగొండ జిల్లాలోనూ అనేక మందిని మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు కటకటాల్లోకి పంపారు. ఇలానే మరికొందరిని ముంచి జైలుకు వెళ్లివచ్చాడు. సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు. -
‘మినీ కాసినో’ సూత్రధారి సంజయ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌లో (ఒకప్పటి వైశ్రాయ్ హోటల్) దీపావళి సందర్భంగా మినీ కాసినో నిర్వహించిన కేసులో సూత్రధారి సంజయ్ కుమార్ అగర్వాల్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఈ దందాలో ఇతడికి సహకరించిన పోలీసు టుడే మాస పత్రిక ఎడిటర్, ఎండీ వామనభట్ల శంకర్శర్మను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం గాంధీనగర్ ఠాణాలో అప్పగించారు. ఆదివారం ఉదయం ఇద్దరినీ గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సంజయ్‌ను రిమాండ్‌కు తరలించగా, శంకర్‌శర్మ స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయికి... సీతాఫల్మండి నామాలగుండుకి చెందిన సంజయ్‌కుమార్ అగర్వాల్ తొలుత నగరంలోని పేకాట క్లబ్బుల్లో దినసరి వేతనంపై పనిచేశారు. అప్పట్లో రోజుకు కేవలం రూ.200 జీతానికి పని చేసిన ఇతగాడు ఆ తర్వాత కొన్నాళ్లకు స్వయంగా పేకాట శిబిరాలు నిర్వహించడం ప్రారంభించాడు. నగరంలో క్లబ్బులు, పేకాట బంద్ అయిన తర్వాత తన సామాజిక వర్గంలో ఉన్న సంపన్నుల కోసం ప్రత్యేకంగా ‘టూర్లు’ ఏర్పాటు చేశాడు. గోవా, కేరళలకు పేకాట ప్రియుల్ని విమానాల్లో తీసుకువెళ్లి సకల విలాసాలతో పేకాట ఆడించి తీసుకురావడం చేస్తున్నాడు. గతంలో సిటీలో పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. ఈ కాసినోపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 20 తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు ప్రవీణ్, బాబూలాల్, వీరి సహాయకులైన ఆరుగురితో పాటు 28 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వీరి విచారణలోనే శంకర్‌శర్మ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న సంజయ్, శర్మల కోసం వేటాడిన టాస్క్‌ఫోర్స్ శనివారం రాత్రి పట్టుకుంది. మారియట్‌లోని ‘కాసినో’నుంచి పోలీసులు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు. మారియట్ హోటలే అడ్డాగా.. దీపావళి నేపథ్యంలో తన అనుచరులైన రాజేశ్ జునేజా, రాజేందర్ నాగ్‌పాల్ సింగ్, చిక్కోటి ప్రవీణ్‌కుమార్, బాబూలాల్ అగర్వాల్‌లతో కలసి వ్యవస్థీకృతంగా పేకాట శిబిరం నిర్వహించడానికి మారియట్ హోటల్‌ను సంజయ్ ఎంచుకున్నాడు. ఈ నెల 17న అందులోని ఏడో అంతస్తులో ఓ సూట్‌తో పాటు రెండు రూమ్స్ బుక్ చేసుకున్నారు. బాగ్‌అంబర్‌పేటకు చెందిన శంకర్‌శర్మ ఈ శిబిరంలో 20 శాతం వాటా కలిగి ఉన్నాడు. ఎస్డీ సజీత్ అలీ, మహ్మద్ జఫార్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఖాజా, రోహిత్ జోషి, కె.నగేష్‌లను సహాయకులుగా ఏర్పాటు చేసుకుని పరిచయస్తులైన పేకాటరాయుళ్లకు ఫోన్ ద్వారా ఈ ‘మినీ కాసినో’పై సమాచారం అందించారు. ఈ పేకాట శిబిరంలో ప్రవేశించడానికి రూ.2 లక్షలు చెల్లించాడు. ఆ మొత్తం కట్టి ఆ విలువకు సరిపడా కాయిన్స్ తీసుకుని పేకాట ఆడటం ప్రారంభించారు. నగదు తీసుకురాని వారి కోసం సంజయ్ స్వైపింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికీ రసీదులు సైతం ఇస్తున్నాడు. సూత్రధారి సంజయ్‌కుమార్, ఇతడి సహాయకుడు బాబూలాల్ అగర్వాల్ పేర్లతో యాక్సిస్ బ్యాంక్ నుంచి రెండు స్వైపింగ్ మిషన్లు తీసుకున్నారు. ఈ పంథాలో మూడు రోజుల్లో రూ. 80 లక్షలకు పైగా పేకాట సాగింది. సూత్రధారి సంజయ్ అగర్వాల్, శంకర్శర్మలు తమకు పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుని ‘కాసినో’కు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రణాళిక వేశారు. -
‘చిలకలగూడ స్నాచర్లు’ చిక్కారు
జిమ్‌లో జత కట్టిన స్నాచర్ల ద్వయం విలాసాల కోసం చోరీల బాట అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సిటీబ్యూరో: నార్త్‌జోన్‌లోని చిలకలగూడ ఠాణా పరిధిలో గత గురువారం ఓ వృద్ధురాలి మెడ నుంచి బంగారం గొలుసు లాక్కుపోయిన స్నాచర్లను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల్లో చిక్కిన ఆనవాళ్ళ ఆధారంగా వీరిని పట్టుకున్నామని, నిందితులపై గతంలో ఎలాంటి కేసు లేవని డీసీపీ బి.లింబారెడ్డి గురువారం తెలిపారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రహమత్ పదో తరగతి వరకు చదివి వేనుభానగర్లో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ముషీరాబాద్ హరినగర్‌కు చెందిన మహ్మద్ జఫార్ మేధి బాకారంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో బుక్ బైండింగ్ పని చేస్తున్నాడు. జిమ్‌కు వెళ్ళే వీరిద్దరికీ అక్కడే పరిచయమైంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంతో పాటు విలాసాలకు డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి స్నాచింగ్స్ చేయాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ పరిసరాల్లో బైక్‌పై తిరుగుతూ కొన్ని రోజులుగా టార్గెట్ల కోసం వెతికారు. గత గురువారం నామాలగుండ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు నాగలక్ష్మమ్మ మెడలో ఉన్న 3 తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. ఆ సమయంలో జఫార్ బైక్ నడపగా... రహమత్ వెనుక కూర్చుని వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాగేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాల పుటేజీ ఆ«ధారంగా నిందితుల్ని గుర్తించారు. గురువారం ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్ని చోరీ సొత్తును విక్రయించడానికి వచ్చిన నిందితుల్ని పట్టుకున్నారు. వీరి నుంచి బంగారు గొలుసు, వాహనంతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. -
టాస్క్ పోర్స్ కూంబింగ్.. ముగ్గురి అరెస్ట్
తిరుపతి: బాక్రాపేట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సమాచారం అందుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగారు. ముగ్గురు ఎర్రచందనం కూలీలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం కూలీల వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రూ.31 లక్షలకు ఏఎంవీఐ ఉద్యోగం!
- నిరుద్యోగులను మోసం చేసేందుకు రంగంలోకి ముఠా - నలుగురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సాక్షి, హైదరాబాద్: ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువకుడిని ఓ ముఠా బుట్టలో వేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష ద్వారా ఎంపిక చేసే అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఏకంగా రూ.17.88 లక్షలు కాజేసింది. తమ ముఠాలో ఒకరిని టీఎస్పీఎస్సీ ఉద్యోగిగా చూపిస్తూ సొమ్ము వసూలు చేసింది. చివరికి సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకుని మాయమైపోయింది. ఏఎంవీఐ పోస్టుల ఫలితాల్లో తన పేరు లేకపోవడంతో బాధితుడు లబోదిబోమంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పరుగెత్తాడు. అక్కడ తనకు ‘హామీ ఇచ్చిన ఉద్యోగి’ ఎవరూ లేకపోవడంతో హతాశుడయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. వెంటనే టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి ఆ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి, రూ.15.88 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండుసార్లు విఫలం కావడంతో... కృష్ణా జిల్లాకు చెందిన పామర్తి శ్రీనివాసరావు గతంలో రెండు సార్లు పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షలు రాసినా ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈసారి టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఎంవీఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశాడు. ఎలాగైనా ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో అన్ని రకాల ప్రయత్నాలూ మొదలుపెట్టాడు. మాజీ ఎమ్మెల్యే రామారావును కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన శ్రీనివాసరావుకు జూబ్లీహిల్స్‌లో నివసించే ఎం.తిరుపతయ్య అలియాస్ తిరుమలరాజుతో పరిచయమైంది. కృష్ణా జిల్లాకే చెందిన తిరుపతయ్య బేగంపేటలోని రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ చీఫ్ ట్రైనర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న శ్రీనివాస్... తనకు ఏఎంవీఐ ఉద్యోగం వచ్చేలా పైరవీ చేయాలని తిరుపతయ్యను కోరాడు. తిరుపతయ్య ఈ విషయాన్ని తమ కార్యాలయంలో పనిచేస్తున్న సయ్యద్ ఖమర్ హుస్సేన్‌కు చెప్పాడు. ఖమర్ సూచనల మేరకు తిరుపతయ్య, మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీలను సంప్రదించాడు. అందరూ కలసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి సొమ్ము దండుకునేందుకు ప్లాన్ వేశారు. లిస్టుల్లో పేరు రాకపోవడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఏఎంవీఐ పోస్టులకు ఎంపికైన వారి తొలి జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అందులో తన పేరు లేకపోవడం గుర్తించిన శ్రీనివాస్ దీనిపై తిరుపతయ్యను సంప్రదించగా రెండో జాబితాలో ఉంటుందని చెప్పాడు. అదే రోజు శ్రీనివాస్‌ను సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌కు పిలిపించిన తిరుపతయ్య, యాకూబ్ అలీ తదితరులు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నమ్మబలికి మరో రూ.5.88 లక్షలు తీసుకున్నారు. అయితే ఈ నెల 13న టీఎస్పీఎస్సీ విడుదల చేసిన రెండో జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో శ్రీనివాస్‌కు అనుమానం వచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీసి... కోటేశ్వరరావు ఎవరూ లేరని గుర్తించాడు, దీనికితోడు తిరుపతయ్య తదితరుల సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించాడు. రూ.31లక్షలకు ఒప్పందం శ్రీనివాస్‌ను ఓ పథకం ప్రకారం తిరుపతయ్య, మీర్ అలీ, మహ్మద్ అలీలు హైదరాబాద్‌లో అబిడ్స్‌లోని ఓ హోటల్‌కు రప్పించారు. తమకున్న పరిచయాలతో ఏఎంవీఐ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.31లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా రూ.2లక్షలు తీసుకున్నారు. డిసెంబర్లో శ్రీనివాస్ నుంచి తిరుపతయ్య మరో రూ.10లక్షలు తీసుకున్నాడు. అయితే మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీ నుంచి సరైన స్పందన లేకపోవడం, శ్రీనివాస్ నుంచి ఒత్తిడి పెరగడంతో తిరుపతయ్య మరో పథకం వేశాడు. జీడిమెట్లలోని ఓ ఫైబర్ కంపెనీలో అకౌంటెం ట్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు షేక్ యాకూబ్ అలీని కోటేశ్వరరావు పేరుతో శ్రీనివాస్‌కు పరిచయం చేశాడు. కోటేశ్వరరావు టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ సెక్షన్లో పనిచేస్తున్నట్లు శ్రీనివాస్‌ను నమ్మించి, అతని ద్వారా ‘పని’ అవుతోందని చెప్పాడు. వెంటనే స్పందించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాస్ ద్వారా చైర్మన్ ఘంటా చక్రపాణికి ఈ వ్యవహారం తెలిసింది. ఆయన వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి... శుక్రవారం తిరుపతయ్య, యాకూబ్, మహ్మద్ అలీ, మీర్ కర్రార్ అలీలను అరెస్టు చేసింది. వారి నుంచి రూ.15.88 లక్షల నగదు, నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే నియామకాలన్నీ పారదర్శకంగా ఉంటాయని, ఎవరూ దళారుల్ని నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సూచించారు. -
రూపాయి వడ్డీకే రుణమంటూ తోడేస్తారు...
► ప్రాసెసింగ్ ఫీజుల పేరుతోనే రూ.వేలల్లో స్వాహా ► కర్నూలు కేంద్రంగా కథ నడిపిన ఘరానా గ్యాంగ్ ► నిందితుడిని అరెస్టుచేసిన టాస్క్‌ఫోర్స్ బృందం సాక్షి, సిటీబ్యూరో: రూపాయి వడ్డీకి రుణాలంటూ పేపర్లలో ప్రకటన ఇవ్వడం... అప్లికేషన్ ఫీజ్ నుంచి ఎన్ఓసీ వరకు పది రకాల చార్జీల పేరుతో దండుకోవడం... చివరకు రుణం ఇవ్వకపోవడం. కర్నూలు కేంద్రంగా ఇలా మోసం చేస్తున్న ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం ముఠాలోని ఒకరి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా నంది కొట్కూరుకు చెందిన ఎస్.శేషుఫణి, సత్య నరసయ్య, గాయత్రి, శారద స్నేహితులు. వీరంతా కలిసి అదే జిల్లా తుమ్మలూరులో బాలాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇందులోనే లక్ష్మీ నర్సింహ చిట్స్ పేరుతో మరో కంపెనీ నడుపుతున్నారు. వీరికి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌తో పాటు నగరంలోని నామాలగుండు, చిలకలగూడల్లోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి. స్థిరాస్తులపై ప్రభుత్వ ఉద్యోగుల హామీతో రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తామంటూ పత్రికల్లో ప్రకటన ఇస్తున్నారు. ఆకర్షితులై తమ కార్యాలయాలకు వచ్చిన వారికి 43 షరతులతో కూడిన పత్రాలు అందిస్తారు. అక్కడ నుంచి దండుకోవడం ప్రారంభించి అందినకాడికి వసూలు చేస్తారు. చివరకు ఒక్క పైసా కూడా రుణం ఇవ్వకుండా మోసం చేస్తారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకట రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి బృందం చిలకలగూడలోని కార్యాలయంపై శుక్రవారం దాడి చేశారు. నిందితుడు శేషుఫణిని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ఎస్సై ఎం.ప్రభాకర్‌రెడ్డిని 9490616667 నెంబర్లో సంప్రదించాలని డీసీపీ కోరారు. గ్యాంగ్ ‘వసూళ్ల మెనూ’ ఇదీ... దరఖాస్తు రుసుం: రూ.1000 నోటరీ సర్టిఫికెట్ ఇచ్చే లాయర్ ఫీజు : రూ.2 వేలు ఇంటికి వెరిఫికేషన్‌కు వచ్చేందుకు: రూ.12 వేలు అందుకు రవాణా, ఇతర చార్జీలు: రూ.8 వేలు ఆస్తిపై అభ్యంతరాలు కోరుతూ రెండు పేపర్ ప్రకటనలకు: రూ.24 వేలు వాల్యూయేషన్ సర్టిఫికెట్, రవాణా చార్జీలు: రూ.7 వేలు ప్రాసెసింగ్ ఫీజ్: రూ.5 వేలు నకిలీ శాలరీ, వాల్యూ, ఎన్ఓసీ పత్రాలకు: రూ.25 వేలు