రూ.31 లక్షలకు ఏఎంవీఐ ఉద్యోగం! | AMVI job to Rs 31 lakh | Sakshi
Sakshi News home page

రూ.31 లక్షలకు ఏఎంవీఐ ఉద్యోగం!

Published Sat, May 28 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

రూ.31 లక్షలకు ఏఎంవీఐ ఉద్యోగం!

రూ.31 లక్షలకు ఏఎంవీఐ ఉద్యోగం!

- నిరుద్యోగులను మోసం చేసేందుకు రంగంలోకి ముఠా
- నలుగురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్
 
 సాక్షి, హైదరాబాద్: ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువకుడిని ఓ ముఠా బుట్టలో వేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష ద్వారా ఎంపిక చేసే అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఏకంగా రూ.17.88 లక్షలు కాజేసింది. తమ ముఠాలో ఒకరిని టీఎస్‌పీఎస్సీ ఉద్యోగిగా చూపిస్తూ సొమ్ము వసూలు చేసింది. చివరికి సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేసుకుని మాయమైపోయింది. ఏఎంవీఐ పోస్టుల ఫలితాల్లో తన పేరు లేకపోవడంతో బాధితుడు లబోదిబోమంటూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి పరుగెత్తాడు. అక్కడ తనకు ‘హామీ ఇచ్చిన ఉద్యోగి’ ఎవరూ లేకపోవడంతో హతాశుడయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. వెంటనే టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి ఆ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి, రూ.15.88 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

 రెండుసార్లు విఫలం కావడంతో...
 కృష్ణా జిల్లాకు చెందిన పామర్తి శ్రీనివాసరావు గతంలో రెండు సార్లు పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షలు రాసినా ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈసారి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఎంవీఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశాడు. ఎలాగైనా ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో అన్ని రకాల ప్రయత్నాలూ మొదలుపెట్టాడు. మాజీ ఎమ్మెల్యే రామారావును కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన శ్రీనివాసరావుకు జూబ్లీహిల్స్‌లో నివసించే ఎం.తిరుపతయ్య అలియాస్ తిరుమలరాజుతో పరిచయమైంది. కృష్ణా జిల్లాకే చెందిన తిరుపతయ్య బేగంపేటలోని రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ చీఫ్ ట్రైనర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న శ్రీనివాస్... తనకు ఏఎంవీఐ ఉద్యోగం వచ్చేలా పైరవీ చేయాలని తిరుపతయ్యను కోరాడు. తిరుపతయ్య ఈ విషయాన్ని తమ కార్యాలయంలో పనిచేస్తున్న సయ్యద్ ఖమర్ హుస్సేన్‌కు చెప్పాడు. ఖమర్ సూచనల మేరకు తిరుపతయ్య, మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీలను సంప్రదించాడు. అందరూ కలసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి సొమ్ము దండుకునేందుకు ప్లాన్ వేశారు.

 లిస్టుల్లో పేరు రాకపోవడంతో..
 ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఏఎంవీఐ పోస్టులకు ఎంపికైన వారి తొలి జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అందులో తన పేరు లేకపోవడం గుర్తించిన శ్రీనివాస్ దీనిపై తిరుపతయ్యను సంప్రదించగా రెండో జాబితాలో ఉంటుందని చెప్పాడు. అదే రోజు శ్రీనివాస్‌ను సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌కు పిలిపించిన తిరుపతయ్య, యాకూబ్ అలీ తదితరులు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నమ్మబలికి మరో రూ.5.88 లక్షలు తీసుకున్నారు. అయితే ఈ నెల 13న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన రెండో జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో శ్రీనివాస్‌కు అనుమానం వచ్చింది. దీంతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీసి... కోటేశ్వరరావు ఎవరూ లేరని గుర్తించాడు, దీనికితోడు తిరుపతయ్య తదితరుల సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించాడు.
 
 రూ.31లక్షలకు ఒప్పందం
 శ్రీనివాస్‌ను ఓ పథకం ప్రకారం తిరుపతయ్య, మీర్ అలీ, మహ్మద్ అలీలు హైదరాబాద్‌లో అబిడ్స్‌లోని ఓ హోటల్‌కు రప్పించారు. తమకున్న పరిచయాలతో ఏఎంవీఐ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.31లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా రూ.2లక్షలు తీసుకున్నారు. డిసెంబర్‌లో శ్రీనివాస్ నుంచి తిరుపతయ్య మరో రూ.10లక్షలు తీసుకున్నాడు. అయితే మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీ నుంచి సరైన స్పందన లేకపోవడం, శ్రీనివాస్ నుంచి ఒత్తిడి పెరగడంతో తిరుపతయ్య మరో పథకం వేశాడు. జీడిమెట్లలోని ఓ ఫైబర్ కంపెనీలో అకౌంటెం ట్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు షేక్ యాకూబ్ అలీని కోటేశ్వరరావు పేరుతో శ్రీనివాస్‌కు పరిచయం చేశాడు. కోటేశ్వరరావు టీఎస్‌పీఎస్సీలో కంప్యూటర్ సెక్షన్‌లో పనిచేస్తున్నట్లు శ్రీనివాస్‌ను నమ్మించి, అతని ద్వారా ‘పని’ అవుతోందని చెప్పాడు.
 
 వెంటనే స్పందించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్
 టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాస్ ద్వారా చైర్మన్ ఘంటా చక్రపాణికి ఈ వ్యవహారం తెలిసింది. ఆయన వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి... శుక్రవారం తిరుపతయ్య, యాకూబ్, మహ్మద్ అలీ, మీర్ కర్రార్ అలీలను అరెస్టు చేసింది. వారి నుంచి రూ.15.88 లక్షల నగదు, నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుంది. టీఎస్‌పీఎస్సీ ద్వారా జరిగే నియామకాలన్నీ పారదర్శకంగా ఉంటాయని, ఎవరూ దళారుల్ని నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement