సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం చట్టవిరుద్ధమంటూ దాఖలైన వ్యాజ్యంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా రమావత్ ధన్‌సింగ్, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, డాక్టర్ అరవిల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్.సత్యనారాయణల నియామకం చట్టవిరుద్ధమంటూ కాకతీయ యూనివర్శిటీ పూర్వ ప్రొఫెసర్ ఎ.వినాయకరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.
కౌంటర్ దాఖలు చేయాలని గత ఏడాది నవంబర్ 8న ఆదేశించినా ఎందుకు దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకు కొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించగా అనుమతించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లో సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు టీఎస్‌పీఎస్సీ, వ్యక్తిగత హోదాలో సభ్యులుగా నియమితులైన ఆరుగురు సభ్యులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 31కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment