రూపాయి వడ్డీకే రుణమంటూ తోడేస్తారు...
► ప్రాసెసింగ్ ఫీజుల పేరుతోనే రూ.వేలల్లో స్వాహా
► కర్నూలు కేంద్రంగా కథ నడిపిన ఘరానా గ్యాంగ్
► నిందితుడిని అరెస్టుచేసిన టాస్క్‌ఫోర్స్ బృందం
సాక్షి, సిటీబ్యూరో: రూపాయి వడ్డీకి రుణాలంటూ పేపర్లలో ప్రకటన ఇవ్వడం... అప్లికేషన్ ఫీజ్ నుంచి ఎన్‌ఓసీ వరకు పది రకాల చార్జీల పేరుతో దండుకోవడం... చివరకు రుణం ఇవ్వకపోవడం. కర్నూలు కేంద్రంగా ఇలా మోసం చేస్తున్న ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం ముఠాలోని ఒకరి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా నంది కొట్కూరుకు చెందిన ఎస్.శేషుఫణి, సత్య నరసయ్య, గాయత్రి, శారద స్నేహితులు. వీరంతా కలిసి అదే జిల్లా తుమ్మలూరులో బాలాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇందులోనే లక్ష్మీ నర్సింహ చిట్స్ పేరుతో మరో కంపెనీ నడుపుతున్నారు.
వీరికి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌తో పాటు నగరంలోని నామాలగుండు, చిలకలగూడల్లోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి. స్థిరాస్తులపై ప్రభుత్వ ఉద్యోగుల హామీతో రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తామంటూ పత్రికల్లో ప్రకటన ఇస్తున్నారు. ఆకర్షితులై తమ కార్యాలయాలకు వచ్చిన వారికి 43 షరతులతో కూడిన పత్రాలు అందిస్తారు. అక్కడ నుంచి దండుకోవడం ప్రారంభించి అందినకాడికి వసూలు చేస్తారు. చివరకు ఒక్క పైసా కూడా రుణం ఇవ్వకుండా మోసం చేస్తారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకట రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి బృందం చిలకలగూడలోని కార్యాలయంపై శుక్రవారం దాడి చేశారు. నిందితుడు శేషుఫణిని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ఎస్సై ఎం.ప్రభాకర్‌రెడ్డిని 9490616667 నెంబర్‌లో సంప్రదించాలని డీసీపీ కోరారు.
గ్యాంగ్ ‘వసూళ్ల మెనూ’ ఇదీ...
దరఖాస్తు రుసుం: రూ.1000
నోటరీ సర్టిఫికెట్ ఇచ్చే లాయర్ ఫీజు : రూ.2 వేలు
ఇంటికి వెరిఫికేషన్‌కు వచ్చేందుకు: రూ.12 వేలు
అందుకు రవాణా, ఇతర చార్జీలు: రూ.8 వేలు
ఆస్తిపై అభ్యంతరాలు కోరుతూ రెండు పేపర్
ప్రకటనలకు: రూ.24 వేలు
వాల్యూయేషన్ సర్టిఫికెట్, రవాణా చార్జీలు: రూ.7 వేలు
ప్రాసెసింగ్ ఫీజ్: రూ.5 వేలు
నకిలీ శాలరీ, వాల్యూ, ఎన్‌ఓసీ పత్రాలకు: రూ.25 వేలు