
అమ్మదొంగా!
ఇతడి పేరు సంతోష్... జంట కమిషనరేట్ల పరిధిలో అనేక చోరీలు చేశాడు...
- పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న గజదొంగ సంతోష్
- మారానంటూ నమ్మించి మళ్లీ నేరాలు
- మైనర్లను వినియోగించి భారీ చోరీలు
- ముమ్మరంగా గాలిస్తున్న నారాయణగూడ పోలీసులు
హిమాయత్‌నగర్: ఇతడి పేరు సంతోష్... జంట కమిషనరేట్ల పరిధిలో అనేక చోరీలు చేశాడు... ఓ దశలో మారానంటూ పోలీసుల్ని నమ్మించి వారి సాయంతోనే ఆటో ఖరీదు చేశాడు... మళ్లీ పాత పంథాలోకే వెళ్లి భారీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతడిని అరెస్టు చేయడానికి నారాయణగూడ పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంతోష్‌నాయక్‌పై జంట కమిషనరేట్ల పరిధిలోని అనేక పోలీసుస్టేషన్లలో కేసులున్నాయి.
గతేడాది సరూర్‌నగర్ ఠాణా పరిధిలో రెండు భారీ చోరీలు చేశాడు. ఆకస్మిక తనిఖీల్లో పట్టుకున్న ఆ ఠాణా పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన సంతోష్ చిక్కడపల్లితో పాటు అదే సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో భారీ చోరీలు చేశాడు. దీంతో సరూర్‌నగర్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.
ఆటోడ్రైవర్‌గా మారి...
సంతోష్‌ను సరూర్‌నగర్ పోలీసులు రెండోసారి అరెస్టు చేసినప్పుడు కొత్త డ్రామాకు తెరలేపాడు. తాను పూర్తిగా మారానని, జీవనోపాధి చూపిస్తే భార్య, పిల్లలతో కలిసి జీవిస్తానని నమ్మబలికాడు. ఇతడి మాటలు విశ్వసించిన పోలీసులు ఓ ఆటో ఖరీదు చేసుకోవడానికి సహకరించారు. ఆటోడ్రైవర్‌గా బతుకుతూనే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలని స్పష్టం చేశా రు.
కొంతకాలం అలానే చేసి న సంతోష్‌పై పోలీసులకూ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లల్లో అతడికీ ఒకటి ఇప్పించాలని నిర్ణయిం చిన అధికారులు అందుకు సన్నాహాలు ప్రారంభించా రు. ఓపక్క పోలీసులు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే సంతోష్ మళ్లీ ‘దారి తప్పాడు’. నారాయణగూడ ఠాణా పరిధిలో భారీ చోరీకి పాల్పడ్డాడు.
మైనర్లను పావులుగా వాడి...
ఈసారి సంతోష్ నాయక్ అత్యంత తెలివిగా వ్యవహరించాడు. తన ఉనికి బయటపడకూదనే ఉద్దేశంతో సమీప బంధువులైన ఇద్దరు మైనర్లను ఎంపిక చేసుకున్నాడు. వీరిని పావులుగా వాడి మార్చి 20, 25 తేదీల మధ్య నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో భారీ చోరీకి పాల్పడ్డాడు. వారం రోజుల ముందు నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్థారించుకున్న తర్వాత ఇద్దరు మైనర్లను పంపి అర్ధరాత్రి చోరీ చేయించాడు. రూ.5 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారం తస్కరించాడు.
పోలీసుల్నే ‘తినేస్తున్న’ సంబంధీకులు...
ఈ చోరీ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. కొన్ని రోజుల క్రితం చోరీ చేసిన ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. వీరి ద్వా రా అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సంతోష్ కోసం తిరగని ప్రదేశం లేదు. సిటీలోని మరికొన్ని కేసుల్లోనూ వాంటెడ్‌గా ఉన్న సంతోష్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలనే ఉద్దేశంతో అతడి సంబంధీకుల్ని సంప్రదిస్తున్నారు. గజ దొంగ ఆచూకీ చెప్తామంటూ వారు పోలీసుల నుంచి డబ్బు పిండుతున్నట్లు సమాచారం. ఈ రూపంలో అధికారులు ఇప్పటికే వేలకు వే లు ఖర్చు చేశారు కూడా. సంతోష్‌ను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం దక్షిణాది వ్యాప్తంగా గాలిస్తోంది.