
ఎవరబ్బాయో..!
నాటకీయ పరిణామాల మధ్య
వీరబల్లి పోలీసులకు దొరికిన బాలుడు
తమ బిడ్డేనంటూ తిరుపతి, హైదరాబాద్ దంపతుల పోటీ
కడప ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో చిన్నారి
కడప రూరల్ : ఓ బాలుడి ఉదంతం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్‌ఆర్ జిల్లా వీరబల్లికి చెందిన ఈశ్వరయ్య, ప్రభావతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో గత ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతికి వెళ్లి, ఓ బాలుడిని వెంట తెచ్చుకున్నారు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశం కావడంతో గురువారం పోలీసులు రంగప్రవేశం చేసి బాలుడిని స్వాధీనం చేసుకుని కడప ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పారు. ఇదిలా ఉండగా ఆ బాలుడు తమ కుమారుడేనని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన వడ్డె వెంకటయ్య, మణెమ్మ దంపతులు శుక్రవారం ఐసీడీఎస్ అధికారులను సంప్రదించారు. తమ కుమారుడైన అరుణ్ గత జనవరి 5వ తేదీన పిల్లలతో బయట ఆడుకుంటుండగా ఎవరో ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
ఈ విషయమై స్థానిక నార్సింగ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. అయితే అదే సమయంలో తిరుపతికి చెందిన లక్ష్మి, చందు అలియాస్ బాషా దంపతులు ఆ పిల్లాడు తమ కుమారుడు దీపక్‌గా చెబుతూ అధికారుల వద్దకు వచ్చారు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యం కోసం ఆదివారం తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లామన్నారు. బయట ఉన్న వృద్ధుడి వద్ద పిల్లాడిని వదిలి లోపలికి వెళ్లి తిరిగివచ్చేసరికి పిల్లాడు కనిపించ లేదన్నారు. దీనిపై స్పందిస్తూ బాలుడిపై సమగ్రంగా విచారణ చేపడతామని, అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఐసీడీఎస్ పీడీ రాఘవరావు తెలిపారు.