వజ్ర బస్సుల్లోనూ టికెట్!
ప్రధాన లోపాన్ని సరిదిద్దుకున్న ఆర్టీసీ
- డ్రైవర్ల ట్యాబ్‌లకు ప్రింటర్లతో అనుసంధానం
- ప్రయాణికుడు డబ్బు చెల్లించగానే ఫోన్‌కు మెసేజ్
- ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: అనుభవం అయితే కానీ ఆర్టీసీ యాజమాన్యానికి వాస్తవం బోధపడలేదు. దేశంలోనే కొత్త ప్రయోగంగా అమల్లోకి తెచ్చిన వజ్ర బస్సుల విషయంలో చేతులు కాల్చుకున్న ఆర్టీసీ క్రమంగా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. బస్సులో టికెట్ ఇచ్చే వీల్లేకుండా ప్రయాణికుల నుంచి ఆదరణ లేకుండా చేసుకున్న యాజమాన్యం ఎట్టకేలకు తన పొరపాటును గుర్తించింది. ఆన్‌లైన్ ద్వారానే కాకుండా నేరుగా మధ్యలో ఎక్కే ప్రయాణికులు డ్రైవర్ ద్వారా టికెట్ పొందేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రత్యేకంగా డ్రైవర్ల వద్ద ఉన్న ట్యాబ్‌లకు మినీ ప్రింటర్లను జత చేశారు. ప్రయాణికుడు డబ్బులివ్వగానే డ్రైవర్లే టికెట్ బుక్ చేసి టికెట్ ప్రింట్ అందజేస్తారు. దీన్ని బుధవారం నుంచే అమల్లోకి తెచ్చారు.
పలు బస్టాండ్లలోకి అనుమతి..
ఈ సర్వీసులు మొదలైనప్పుడే డ్రైవర్లకు ట్యాబ్‌లు అందించారు. ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్ చేసుకున్న వారికి వివరాలు అందులో కన్పిస్తాయి. ప్రయాణికులు ఎక్కడ బస్సు ఎక్కుతారో వాటి ద్వారానే డ్రైవర్లకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ట్యాబ్‌ల ద్వారానే ప్రయాణికులకు టికెట్ జారీ చేసేలా ఏర్పాటు చేశారు. మధ్యలో బస్సెక్కిన ప్రయాణికులకు డ్రైవర్ ట్యాబ్‌లో టికెట్ బుక్ చేస్తాడు. టికెట్ వివరాలు ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళుతుంది. టికెట్ కావాలంటే ఆ ట్యాబ్‌లకు అనుసంధానం చేసిన ప్రింటర్ల ద్వారా జారీ అవుతుంది. గతంలో బస్టాండుల్లోకి బస్సులు వెళ్లేవి కావు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇమ్లీబన్, జేబీఎస్‌ల వద్దకు బస్సులు వెళ్తున్నాయి.
త్వరలో రామగుండం, గోదావరిఖనిలకు సర్వీసులు..
ఈ నెలాఖరున కానీ సెప్టెంబర్ మొదటివారంలో కానీ రామగుండం, గోదావరిఖనిలకు వజ్ర బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 8 చొప్పున 16 బస్సులను కేటాయించారు.
ముందే చేసి ఉంటే..
వజ్ర ఏసీ బస్సులు హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నిజామా బాద్ మధ్య తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో సగటున 30% మించట్లేదు. ఇప్పటివరకు యాప్ ద్వారానో, ఆన్‌లైన్‌లోనో, ఉప్పల్ కూడలి, సుచిత్ర కూడలిలో ఉన్న అధీకృత ఏజెంట్ వద్దే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. మధ్యలో బస్సు ఎక్కితే తొలుత నో చెప్పినా ‘సాక్షి’ కథనాల ప్రభావంతో వారిని ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. అయితే టికెట్ ఇవ్వకుండా ఏజెంట్ వద్దే కొనాలని కండీషన్ పెట్టారు. ఈ నిబంధనతో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. క్రమంగా ఇది నష్టాలకు దారి తీస్తుండటంతో అధికారులు మేలుకున్నారు. వజ్ర బస్సు డ్రైవర్లు కూడా టికెట్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు టిమ్ యంత్రాలు ఇవ్వాలని డిపో మేనే జర్లు మొదట్నుంచీ మొత్తుకుంటున్నా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు.