
1500మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్ : నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1500మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూ ఇయర్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేస్తే ఈవెంట్ మేనేజర్ పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అలాగే ఈవెంట్‌కు వచ్చినవారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత కూడా ఈవెంట్ నిర్వహకులదే అని సీపీ పేర్కొన్నారు. ఇక డీజేలకు అనుమతి లేదని న్యూ ఇయర్ వేడుకలకు డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆలోపే వేడుకలను పూర్తి చేసుకోవాలని సీపీ సూచించారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మరింత పకడ్బందిగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ట్రిబుల్ రైడింగ్, ర్యాస్ డ్రైవింగ్ నిర్వహించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. వారిపై మోటార్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.