కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు: కోదండరామ్
హైదరాబాద్ : ప్రజల పక్షానే తెలంగాణ జేఏసీ ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) బుధవారమిక్కడ సమావేశమై విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. సమావేశం అనంతరం కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 'జేఏసీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. దాడుల జరిగినా వెనకడుగు వేసేది లేదు. వ్యవసాయం, కులవృత్తులు, ఓపెన్ కాస్ట్ సమస్యలపై పోరాడుతాం. ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తాం. నిజాం షుగర్స్ సహా మూతపడ్డ కంపెనీలను తెరిపించాలి. యూనివర్శిటీల సమస్యలపై త్వరలో ఉస్మానియా వర్శిటీలో సెమినార్ పెడతాం. విద్యాసంస్థలపై పోలీసులతో దాడి చేయించడం సరికాదు.
మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా త్వరలో గజ్వేల్లో సదస్సు నిర్వహిస్తాం. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. మిషన్ భగీరథ సహా అన్ని కాంట్రాక్ట్ల డీపీఆర్లను వెబ్ సైట్లో పెట్టాలి. న్యాయమూర్తుల పోరాటానికి సంపూర్ణ మద్దతు. ప్రజా సంక్షేమమే టీజేఏసీ లక్ష్యం. నేను నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్న...ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో లేను. రెండుసార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదు. ఉద్యోగుల జీవితాలు బాగుపడ్డట్టే..ప్రజల జీవితాలు కూడా బాగుపడాలి. నాపై విమర్శలు చేసినవారిలా నాకు ఆ భాష రాదు.' అని కోదండరామ్ వ్యాఖ్యానించారు.