అవసరమైతే పార్టీ పెడతాం: కోదండరాం
హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టే సందర్భం, అవసరం వస్తే తప్పకుండా పెడతామని జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతోందన్నారు. ఒక వేళ పార్టీ పెట్టాల్సిన అవసరం, సందర్భం వస్తే తప్పకుండా పెడతామన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా.. జేఏసీ మాత్రం కొనసాగుతుందన్నారు.
జోనల్ వ్యవస్థను రద్దు చేస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అందుకే జోనల్ సిస్టమ్‌ను రద్దు చేయకుండా దాన్ని సవరించాల్సిన అవసరముందున్నారు. ఈ నెల 22న తెలంగాణ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగుల ర్యాలీ శాంతియుతంగా జరుగుతుందన్నారు. అనవసరంగా ఎవరు ఆవేశపడొద్దని.. జేఏసీని బద్నామ్ చేయడానికి కొందరు కాచుకొని కూర్చున్నారని.. గొడవలు, కాల్పులు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలిసిందన్నారు. ఏది ఏమైనా ర్యాలీ శాంతియుతంగా జరిగేలా సహకరించాలని కోరారు.