‘సంకెళ్లు వేసిన పోలీసులపై కేసులు పెట్టాలి’
హైదరాబాద్సిటీ: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు హాజరుపరచడాన్ని టిజేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. అలాగే రైతులకు బేడీలు వేసిన పోలీసులపై కేసులు పెట్టాలన్నారు. మిర్చి యార్డుపై దాడి చేశారనే ఆరోపణలతో 10 మంది రైతులకు గురువారం పోలీసులు సంకెళ్లు వేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనన్నారు. నిందితులకు, నేరస్తులకు గానీ కోర్టు అనుమతి లేనిదే సంకెళ్లు వేయకూడదని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు.
గిట్టుబాటు ధర రైతులకు వచ్చేలా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం పత్తి వేయకూడదని ప్రకటించడంతో రైతులు మిర్చి వైపు మొగ్గు చూపారని గుర్తు చేశారు. గిట్టుబాటు ధర దొరక్క ఆవేశంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తే... సమస్యపై దృష్టిపెట్టి పరిష్కరించాల్సిన ప్రభుత్వం, రైతులను అణచివేయాలని ప్రయత్నించడం గర్హనీయమన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని అన్నారు. ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం రైతులకు శాపంగా పరిణమించింది.
ఒకవైపు ప్రభుత్వ నిష్కృయా పరత్వం, మరోవైపు దళారులు, రాజకీయనాయకులు కుమ్ముక్కయ్యి రైతుకు మద్దతు ధర రాకుండా చేస్తున్నారు. ఈ విషయాలు మేము చేపట్టిన మార్కెట్ యార్డుల పర్యటనలో స్పష్టమైందని కోదండరాం తెలిపారు. రైతు సమస్యను పెద్ద మనసుతో అర్దం చేసుకోవాల్సిన ప్రభుత్వం, రైతులను సంకెళ్లతో అణచివేయాలని చూస్తే సమాజంలో మరింత అలజడి, అశాంతి తప్పదన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి వెంటనే మద్దతు ధరను ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు.