
వెలవెల
=మొక్కుబడిగా ఓటర్ల నమోదు
=సిబ్బంది గైర్హాజరు
=దరఖాస్తుల కొరత
=మధ్యాహ్నానికే బూత్‌ల మూత
=జనానికి తప్పని అవస్థలు
సిటీబ్యూరో, న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : మళ్లీ అదే తీరు... గ్రేటర్ వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమం అధికారుల తీరుతో వెలవెలబోయింది. పాతనగరం మినహా పలు చోట్ల నమోదు కార్యక్రమం పేలవంగా జరిగినట్లు ‘న్యూస్‌లైన్’ పరి శీలనలో వెల్లడైంది. సోమవారం సాయంత్రంతో ము గియనున్న ఈ కార్యక్రమంపై పోలింగ్ బూత్‌ల వారీ గా విస్తృత ప్రచారం చేయకపోవడం పెద్ద లోటుగా పరిణమించింది. చాలాచోట్ల కనీసం బ్యానర్ ఏర్పాటు చేయకపోవడం, ఆయా కేంద్రాల వద్ద మున్సిపల్ అధికారులు అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల ఓటర్ల నమోదు కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగింది. పలు కేంద్రాల్లో ఫారం 6, 7, 8, 8ఏలు అందుబాటులో లేకపోవడంతో సిటీజనులు ఇబ్బందులు పడ్డారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం చాలా చోట్ల మధ్యాహ్నం ఒంటిగంటకే ముగిసింది. అదీ మొక్కుబడిగానే. ఓటరు నమోదు కేంద్రాలపై నమ్మకం లేక పలువురు సిటీజనులు ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్‌మెంట్ 6 ఫారాలను సమర్పించడం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్,తార్నాక, మల్కాజ్‌గిరి, మెహిదీపట్నం, కుత్బుల్లాపూర్, బాలానగర్, చిక్కడపల్లి, అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చాలా కేంద్రాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది విధులకు గైర్హాజరవడంతో కేంద్రాలు వెలవెలబోయాయి.
కవాడిగూడా డివిజన్ పరిధిలో మొత్తం 29 పోలింగ్ బూత్‌లుండగా కేవలం ఒకేచోట నమోదు కార్యక్రమం జరగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. సిబ్బంది లేమి కారణంగా వివిధ పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పౌరులు నిరాశగా వెనుదిరిగారు. గత నెలలో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు ప్రక్రియకు ఎలాంటి ప్రచారం లేకపోవడంతో నూతన ఓట్ల నమోదు కోసం ఏర్పాటుచేసిన బూత్‌లు వెలవెలబోయిన విషయం విదితమే.
కాగా చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో సందడి నెలకొనడం గుడ్డిలో మెల్ల.
వివిధ ప్రాంతాల్లో నమోదు తీరిదీ...
బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని షేక్‌పేట మండల కార్యాలయం ఆవరణలో ఉన్న పోలింగ్ స్టేషన్‌లో కౌంటర్ ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వెనుదిరిగారు.
ఖైరతాబాద్ నియోజక వర్గం పరిధిలో 242 పోలింగ్ బూత్‌లు ఉండగా చాలా చోట్ల ఆదివారం కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. సందేహం ఉన్నవారికి సూచనలు జారీ చేయాల్సిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అందుబాటులో లేరు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక జనం నానా తంటాలు పడ్డారు.
బర్కత్‌పుర డివిజన్‌లోని దీక్షా మోడల్ స్కూల్, కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, అవంతి డిగ్రీ కాలేజ్, సత్యానగర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మొక్కుబడిగా ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది.
కుత్బుల్లాపూర్‌లోని రంగారెడ్డినగర్, గాంధీనగర్, చింతల్, కుత్బుల్లాపూర్ పోలింగ్ స్టేషన్‌లలో ఉన్న బీఎల్ ఓలు ఉన్నతాధికారుల పర్యటన ముగియగానే కేంద్రాల నుంచి నిష్ర్కమించడంతో జనం ఇబ్బందులు పడ్డారు.
కవాడిగూడా డివిజన్ పరిధిలో మొత్తం 29 పోలింగ్ బూత్‌లుండగా కేవలం ఒకేచోట నమోదు కార్యక్రమం జరగడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.
దరఖాస్తులేవీ?
మా ఇంట్లో ఆరుగురు ఓటర్లం ఉన్నాం. కానీ ఓటర్ జాబితాలో మాత్రం కేవలం ఒకరి పేరే ఉంది. దీంతో మరోసారి మా పేర్లను దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాము. ఇక్కడికి వచ్చాక దరఖాస్తు ఫారాలు అయిపోయాయంటున్నారు. నమోదు ప్రక్రియ గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలి.
- నితిన్ శర్మ, హరిబౌలి
ప్రచారమేదీ?
అవగాహన లేకపోవడంతో ఇప్పటి వరకు ఓటర్‌గా పేరు నమోదు చేసుకోలేదు. ఓటరు నమోదు ప్రక్రియ ఏర్పాటు చేసినప్పుడు ఆటోల్లో, బస్తీల్లో ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది. దీంతో పాటు ఓటర్ లిస్ట్‌లలో కుటుంబ సభ్యులు పేర్లు ఉన్నాయో...? లేవో...? చూసుకోవాలనే విషయమై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- జి.నిఖిత, లాల్‌దర్వాజా