సాక్షి, రాజమండ్రి :
ఎక్కడ చూసినా వందలాది మంది మహిళలు.. పార్టీ జెండాలు నెత్తిన టోపీలు.. ఫలానా పార్టీకే మీ ఓటు అంటూ నినాదాలు.. మా నాయకుడికి జై.. జై అంటూ నినాదాలు. ఇదేంటి అభ్యర్థికి ఓటు వేయాల్సిన జనం.. ఎన్నికలప్పుడు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటెయ్యాలి కానీ, ఆయన వెంట ఇలా తిరగడ మెందుకని ముందుగా సందేహం వస్తుంది.. కానీ అసలు విషయం తెలిసాక మాత్రం భలే మంచి బేరం అనుకోక మానం.
మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారానికి అభ్యర్థులు జిల్లాలో వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి పనివారిని దండిగా తరలిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నేతలు ఇందులో ముందున్నారు. ఒక్కొక్క అభ్యర్థి 50 నుంచి 100 మంది మహిళలను తమ వెంట తిప్పు కుంటున్నారు.ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థులు 150 మందిని కూడా తిప్పుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ జెండాలు పట్టుకుని మహిళలు నినాదాలతో వెనుక నడవగా తాను ‘కొని’ తెచ్చుకున్న జన బలం ప్రదర్శించుకుంటూ ఇంటింటి ప్రచారం సాగించేస్తున్నారు.
భలే మంచి బేరం
ఉపాధి పనులకు వె ళితే సగటున రూ. 100 నుంచి రూ. 120 వరకూ గిడుతోంది. భోజనం అదే డబ్బులతో చేయాలి, కానీ ఎన్నికల ప్రచారం కోసం వెళితే ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రూ. 150 నుంచి రూ. 200 వరకూ చెల్లిస్తారు. మస్తర్ రోల్స్, వారానికి ఒక సారి పేమెంటు, ఆధార్ లింకు ఇవేమీ ఉండవు. ఉదయం టిఫిన్ వాళ్లే పెడతారు, మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం అయ్యేసరికి కూలీ ఇచ్చేస్తున్నారు. భలే బేరం కదా మరి...
ఈ ప్రభావం ఎంతగా ఉందంటే
జిల్లాలో ఉపాధి పనులకు హాజరవుతున్న వారి సంఖ్య పరిశీలిస్తే ఎన్నికల ప్రచారానికి కూలీల వలస ఎలా ఉందో అర్థం అవుతుంది. మార్చి రెండు నుంచి ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి 70,000 మంది పనులకు హాజరయ్యారు. తొమ్మది నుంచి 15 వరకూ పనులకు 77,000 మంది హాజరయ్యారు.కాగా ఈ నెల 18 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఊపందుకోవడంతో 16 నుంచి ప్రారంభమై 22తో ముగిసిన వారానికి పనులకు హాజరైన వారు ఐదు వేల మంది కూడా లేరని గణాంకాలు చెబుతున్నాయి.
భలే మంచి ఎన్నికల బేరము
Published Thu, Mar 27 2014 12:32 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement