ఓ టూరేద్దాం..
ఐఆర్‌సీటీసీ వేసవి ప్యాకేజీలు సిద్ధం
ఢిల్లీ నుంచి ‘మహారాజా’ పయనం
సిటీబ్యూరో: వేస‘విహారాని’కి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల పర్యాటకుల అభిరుచికి అనుగుణమైన ప్యాకేజీలను ప్రకటించింది. మండుటెండల్లో ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా గడిపేందుకు అనువైన కూల్ ట్రిప్స్ కూడా ఈ పర్యటనల్లో ఉన్నాయి. ప్యాకేజీల వివరాలను ఐఆర్‌సీటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ప్యాకేజీల వివరాలు..
జమ్ము నుంచి కాట్రా, శ్రీనగర్, గుల్మార్గ్, సోన్‌మార్గ్, పహల్గామ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తిరిగి జమ్ముకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. ఈ పర్యటనకు ఒక్కొక్కరికి రూ. 15,890 చార్జీ ఉంటుంది.మాతా వైష్ణోదేవి యాత్రా పర్యటన.. జమ్ము, శ్రీనగర్, గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాల్లో 7 రాత్రులు, 8 పగళ్లు పర్యటన ఉంటుంది. చార్జీ రూ.15,020.జన్మత్-ఇ కశ్మీర్ మాతా వైష్ణోదేవి ఆలయ పర్యటనలో శ్రీనగర్ నుంచి బయలుదేరి జమ్ము చేరుకుంటారు. 7 రాత్రులు, 8 పగళ్లకు రూ.14,480 చార్జీ. డిస్కవర్ అమేజింగ్ కాశ్మీర్ ప్యాకేజీలో శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్ పర్యటన ఉంది. 5 రాత్రులు, 6 పగళ్లకు రూ.10,910 చార్జీ ఉంది. నార్త్ ఈస్ట్ డిలైట్స్ ప్యాకేజీలో న్యూ జుల్పాయ్‌గురి, బడోగ్రా, డార్జిలింగ్, పెలింగ్, గ్యాంగ్‌టక్, కలింపాంగ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తిరిగి న్యూ జల్పాయ్‌గురి చేరుకుంటారు. చార్జీ రూ. 20,217. ది స్ప్లెండర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ మరో టూరిజం ప్యాకేజీ. న్యూ జల్పాయ్‌గురి, బడోగ్రా, డార్జిలింగ్, గ్యాంగ్‌టక్, కలింపాంగ్ తదితర ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుంది. చార్జీ రూ.16,001. హిమాచల్ పర్యటన సికింద్రాబాద్ నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో సిమ్లా, కుఫ్రీ, కులు-మనాలి, రోహ్‌తక్ పాస్, చండీఘర్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఒక్కొక్కరికి రూ.11,740 చార్జీ ఉంటుంది.
‘మహారాజా’లో ప్రయాణం..
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ట్రైన్‌గా ప్రసిద్ధి చెందిన ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’లో కూడా పర్యటించవచ్చు. విశాలమైన బెడ్‌రూమ్స్, డైనింగ్ హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ హాళ్లు వంటి సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా వివిధ పర్యాటక ప్రాంతాలకు ఇది రాకపోకలు సాగిస్తుంది. విదేశీ టూరిస్టులు ఎక్కువగా ఈ ట్రైన్‌లో పర్యటిస్తారు. ముంబయి, అజంతా, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైపూర్, రణతంబోర్, ఆగ్రా, ఢిల్లీల్లో 8 పగళ్లు, 7 రాత్రులు పర్యటన ఉంటుంది.
ఈ-కేటరింగ్ సదుపాయం
దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఏ, ఏ-1 కేటగిరీ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు కోరుకున్న ఆహార పదార్థాలను అందించేందుకు ఐఆర్‌సీటీసీ ఏర్పాట్లు చేసింది. టిక్కెట్ బుకింగ్‌తో పాటే ఐర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ కేటరింగ్ ఆర్డర్ ఇవ్వవచ్చు. ట్రైన్ నుంచి క్యాబ్ సర్వీస్ కూడా ఉంది.