‘పది’లమే! | tomorrow tenth class exams | Sakshi
Sakshi News home page

‘పది’లమే!

Published Mon, Mar 23 2015 11:59 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

‘పది’లమే! - Sakshi

‘పది’లమే!

రేపటి నుంచి  పదో తరగతి పరీక్షలు  
హాజరుకానున్న 80,349 మంది
విద్యార్థులు, తల్లిదండ్రుల్లోఆందోళన వద్దు    డీఈఓ సోమిరెడ్డి

 
సిటీబ్యూరో:  పాఠ్యాంశాలతో పాటు పరీక్ష విధానంలో మార్పుల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురవకుండా... ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేలా సన్నద్ధం చేశామని హైదారాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి సోమిరెడ్డి తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చే నెల 11వ తేదీ వరకు కొనసాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఉదయం 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అవసరమైతే ఒక రోజు ముందుగా కేంద్రాన్ని చూసుకుంటే... పరీక్ష రోజున ఆందోళనకు తావుండదన్నారు. ‘పది’ పరీక్షల నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
80 వేల మంది విద్యార్థులు

హైదరాబాద్ జిల్లాలో 80,349 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 66,071 మంది రె గ్యులర్, 14,278 మంది ప్రైవేట్ విద్యార్థులు. వీరికి వేర్వేరుగా 292 కేంద్రాలు ఏర్పాటు చేశాం.  21 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించాం. వారు నిరంతరం  కేంద్రాల్లో తనిఖీలు చేపడతారు. ఎక్కడికి వెళ్లేదీ అప్పటికప్పుడే నిశ్చయించుకుంటారు. జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక కేంద్రాలు లేవు. మొత్తం 4,020 మంది ఇన్విజిలేటర్లు  విధులు నిర్వహిస్తారు. ప్రతి కేంద్రాన్నీ చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

సౌకర్యాలపై దృష్టి

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అన్నిచోట్లా ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పూర్తయ్యేవరకు మెడికల్ కిట్‌తో ఒక ఏఎన్‌ఏం అక్కడ విధుల్లో ఉంటారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆచుట్టుపక్కల గల జిరాక్స్ సెంటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో ఈసారి 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తామన్న నమ్మకం ఉంది. మారిన సిలబస్, పరీక్షా విధానంపై విద్యా సంవత్సరం మొదటి నుంచీ విద్యార్థులకు అవగాహన కల్పించాం. ఉదయం, సాయంత్రం రెండుపూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.
 
 
విద్యార్థులూ ఇవి పాటించండి
 
పరీక్షకు ముందు రోజు కేంద్రాన్ని ఒకసారి చూస్తే కొంత ఆందోళన దూరమవుతుంది.పరీక్ష కేంద్రానికిఅరగంట ముందే చేరుకోవాలి. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, స్కేల్, రైటింగ్ ప్యాడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. పెన్నులు అదనంగా ఉంచుకోవడం ఉత్తమం. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏదైనా ఆహా రం మితంగా తిని పరీక్షకు హాజరైతే మంచిది. ఒకవేళ హాల్‌టికెట్ పోగొట్టుకున్నా, ఫీజులు చెల్లిం చలేదని స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినా హాల్‌టికెట్ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. www. bsetelangana.org  వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని  సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునితో సంతకం చేయించుకుని విద్యార్థి పరీక్షలకు హాజరుకావచ్చు.
 
 
ప్రశాంతంగా రాయండి: కలెక్టర్
 
పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు గురికావద్దని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని హైదరాబాద్ కలెక్టర్ కె. నిర్మల సూచించారు. ఈ పరీక్షలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. పరీక్ష సమయానికంటే అరగంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని ఆదేశించారు. డిపార్ట్‌మెంట్ అధికారులు, విధుల నిర్వహణకు నియమించిన సిబ్బంది మినహా ఇతరులను అనుమతించకూడదని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement