టాప్ ర్యాంకు విద్యార్థులకే 100% ఫీజు!
కటాఫ్‌గా ఏ ర్యాంకును తీసుకోవాలనే అంశంపై ఆలోచనలు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల వృత్తివిద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఫీజులను చెల్లించే ందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకే ఫీజును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం వారి ర్యాంకుల ఆధారంగా ఎంత శాతం ఫీజు చెల్లించాలనే అంశంపై చర్చిస్తోంది.
కనీస ఉత్తీర్ణత శాతం, కనీస హాజరు శాతం వంటి అంశాలను ఫీజుల చెల్లింపులో పరిగణనలోకి తీసుకుంటున్న ప్రభుత్వం టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారు చేరే కాలేజీల్లో ప్రవేశానికి నిర్ధారించిన ఫీజు మొత్తాన్ని (100 శాతం) చెల్లించాలని భావిస్తోంది. మిగతా విద్యార్థులకు మాత్రం ఆయా కోర్సుల్లో ప్రవేశానికి నిర్ధారించిన కనీస ఫీజును మాత్రమే చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం వర్తింపులో ఈ మేరకు కటాఫ్ ర్యాంకులను నిర్ధారించనుంది.
ఈ నేపథ్యంలో 2 వేల ర్యాంకు లేదా 5వేల ర్యాంకును కటాఫ్‌గా తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై పరిశీలన జరుపుతోంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో కనీస ఫీజు రూ. 35 వేలు కాగా గరిష్టంగా 1.56 లక్షల వరకు ఫీజు ఉంది. ప్రభుత్వం నిర్ధారించే కటాఫ్ ర్యాంకుల్లో ఉన్న వారికి ఆయా కాలేజీల్లో ప్రవేశానికి అయ్యే మొత్తం ఫీజును ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక మిగతా విద్యార్థులకు మాత్రం కనీస ఫీజునే చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని సదరు విద్యార్థే భరించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు రూ. 55 వేలు ఫీజు ఉన్న కాలేజీలో ఓ విద్యార్థి చేరితే ప్రభుత్వం రూ. 35 వేలు ఇస్తే మిగతా రూ. 20 వేలను విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వృత్తి విద్యా కోర్సులో ఇదే విధానాన్ని అనుసరించబోతోంది. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం వంద శాతం ఫీజును చెల్లించనుంది. బీసీ, ఈబీసీ విద్యార్థులకు మాత్రం కొత్తగా అమల్లోకి తేనున్న విధానాన్ని అనుసరించనుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కాకుండా ఇతర సామాజిక వర్గాల విద్యార్థులకు 10 వేల లోపు ర్యాంకు ఉంటే వారి మొత్తం ఫీజును ప్రభుత్వమే భరించేది. ఇకపై అలా కుదరదని తెలుస్తోంది. అయితే దీనిపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కాలేజీల నియంత్రపైనా దృష్టి..
కాలేజీలను నియంత్రించేందుకు, ప్రమాణాలు పాటించేలా చేసేందుకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. అర్హులైన ఫ్యాకల్టీ, నాణ్యమైన విద్యా బోధన కోసం థర్డ్ పార్టీచేత ఆకస్మిక తనిఖీలు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉంది. దానికి ఇపుడు జీవం పోసి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతేకాక కాలేజీల్లో లోపాలు, అక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయనున్నారు. తద్వారా కాలేజీలను నియంత్రించడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.