కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు
మెహిదీపట్నం: రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, దానికి చరమగీతం పాడాల్సిన రోజు ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని టీఆర్‌ఎస్ చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్వాన్ నియోజకవర్గంలో లక్ష్మీనగర్ చౌరస్తా, మొగల్‌కా నాలా, బాలాజీనగర్, గుడి మల్కాపూర్, విశ్వేశ్వరనగర్, జాఫర్‌గూడలో నిర్వహించిన రోడ్‌షోల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం రాంసింగ్‌పురా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సోనియాగాంధీ మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని, కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మెట్రో రైలు, ఔటర్ రింగ్‌రోడ్, కొత్త ఎయిర్‌పోర్టు, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఫార్మా సిటీ, ఐటీ క్యాపిటల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. దళితుణ్ని సీఎం చేస్తానని ప్రకటించిన కే సీఆర్ అనంతరం ఆయనే పదవి చేపట్టి వారిని మోసం చేశారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణాల మాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, డ్వాక్రా మహిళలకు అభయహస్తం, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందజేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు దానం నాగేందర్, కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి రూప్‌సింగ్, పార్టీ అభ్యర్థులు బల్వీర్‌సింగ్, చంద్రకాంత్‌రావ్, ఎన్నికల పరిశీలకులు లక్ష్మణ్‌కుమార్, సీనియర్ నాయకులు ప్రహ్లాద్ యాదవ్, అఫ్సర్ యూసుఫ్ జావెద్, సుభాష్ సింగ్, పురుషోత్తం సింగ్, శంకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.