నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలనుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు.
ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్ రైలు నడిచేలా ఎర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 24వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడమేగాక 13 కంపెనీల కేంద్ర పారా మిలటరీ దళాలను, సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును రంగంలోకి దించారు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున గణేష్ యాక్షన్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ పోలీసులు తొలిసారిగా ఈ కెమెరాను ఉపయోగిస్తున్నారు.