ట్రాజెడీ... నో రియాల్టీ.. | Tragedy ... No reality .. | Sakshi
Sakshi News home page

ట్రాజెడీ... నో రియాల్టీ..

Published Tue, Apr 12 2016 12:00 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

ట్రాజెడీ...  నో రియాల్టీ.. - Sakshi

ట్రాజెడీ... నో రియాల్టీ..

కొన్ని సర్పాలతో పాటు కీటకాలున్న గాజు పెట్టెలో చేతులు పెట్టేదొకరు..

టీవీ షోలకు ఆకర్షితులవుతున్న యువత
నిజ జీవితంలో స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదికి
గత ఏడాది స్ట్రీట్ ఫైట్... తాజాగా ఫైర్ ఫైట్



సిటీబ్యూరో:  కొన్ని సర్పాలతో పాటు కీటకాలున్న గాజు పెట్టెలో చేతులు పెట్టేదొకరు..  అల్లంత ఎత్తులో ఒంటికి నిప్పుపెట్టుకుని కింద నీటిలోకి దూకేది ఇంకొకరు... బైక్‌పై వేగంగా దూసుకుపోతూ నేలపై ఉన్న వస్తువుల్ని తీసేది మరొకరు...

 
ఇటీవల కాలంలో సినిమాలను మించిపోతున్న ఈ సీన్లు టీవీల్లోని రియాల్టీ షోల్లో నిత్యం కనిపిస్తున్నాయి. వీటిని ‘స్ఫూర్తి’గా తీసుకుంటున్న బాలురు, యువత వాటిలో పాల్గొనాలనో, ఆ స్థాయిలో స్టంట్స్ చెయ్యాలనో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా గాయపడటంతో పాటు మృత్యువునూ కొనితెచ్చుకుంటున్నారు. సోమవారం పాతబస్తీలోని ఫలక్‌నుమ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చిన జలాలుద్దీన్ మృతి ఉదంతం ఈ కోవకు చెందినదే. బయటపడుతున్నవి, పోలీసు రికార్డుల్లోకి  ఎక్కుతున్నవి తక్కువే అయినా... ఈ రియాల్టీల ప్రభావం టీనేజర్లపై ఎక్కువగా ఉంటోందని మానసిక నిపుణులు చెప్తున్నారు.

 
పరిపక్వత లేకపోవడమే ప్రధాన కారణం...
టీవీ షోల ప్రభావానికి లోనవుతున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉంటున్నారు. ఓ ఛానల్‌లో ప్రసారమయ్యే రెజ్లింగ్‌తో ప్రేరణ పొందిన కొందరు యువకులు గత ఏడాది మేలో పాతబస్తీలో వీరంగం సృష్టించారు. ఫం జెషా బస్తీలో ఏడుగురు యువకుల మధ్య ప్రారంభమైన పందెం స్ట్రీట్ ఫైట్‌కు దారి తీసింది. ఈ పోరులో 17 ఏళ్ల నబీల్ ప్రాణాలు కోల్పోయాడు. టీనేజ్‌లో ఉన్న యువతలో పరిపక్వత తక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు ఆ వయసులో ఇతరుల్ని, కొన్ని కార్యక్రమాలు చూసి సాహసాలు చేయాలనే ధోరణిలోకి వెళ్లిపోతారు. అందులోనే హీరోయిజం, విజయం ఉన్నాయని భావించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. జలాలుద్దీన్ సైతం కలర్స్ ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ కార్యక్రమంలో భాగమైన ‘ఫియర్ ఫ్యాక్టర్-ఖత్రోంకి ఖిలాడీ’ సిరీస్‌లో పాల్గొనడానికి ‘రిహార్సల్స్’ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడని దక్షిణ మండల పోలీసులు తెలిపారు.


అవి చూసే బైక్ రేసులు సైతం...
నగరంలోని దక్షిణ మండలంతో పాటు పశ్చిమ మండలంలోని అనేక ప్రాంతాలు ‘రేస్ ఎఫెక్డెడ్’ జాబితాలోకి వస్తాయి. మధ్య మండల పరిధిలో ఉన్న నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ఏరియాల్లోనూ బైక్ రేసింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకరితో ఒకరు పోటీ పడి దూసుకుపోవడం, వీలింగ్ పేరుతో వాహనాన్ని ఉన్న స్థానంలోనే గుండ్రంగా తిప్పడం, ముందు చక్రం పెకైత్తి నడిపిం చడం, వాహనంపై నిల్చోవడం... ఇలా అనేక స్టంట్స్‌కు సినిమాలు, టీవీల్లోని అంశాలే ప్రేరణగా మారుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఓ ప్రాంతంలో నిఘా ఉంచి ‘రేసర్లను’ పట్టుకుంటున్నారు. వారితో పాటు తల్లిదండ్రుల్నీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ చర్యలతో కొన్ని రోజులు మిన్నకుండిపోతున్న యువత... ఆపై ప్లేసులు మార్చి మళ్లీ రెచ్చిపోతున్నారు. అనేక సందర్భాల్లో వాహనాలు ధ్వంసం కావడం, క్షతగాత్రులు కావ డం జరుగుతున్నా వీరిలో ఆశించిన మార్పు రావట్లేదు.

 
అసలు వాస్తవాలు మర్చిపోతున్నారు...

సినిమాలు, టీవీలను అనుకరిస్తున్న టీనేజర్లు అసలు వాస్తవాలను గుర్తించలేకపోవడం, గమనించినా పట్టించుకోకపోవడం జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు. వీటికి తోడు ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనలు సైతం యువతను ‘ప్రేరేపించేవిగా’ ఉంటున్నాయి. వాటిలో స్టంట్స్ చేసే వారు నిపుణుల  పర్యవేక్షణలోనే సాగిస్తారు. ఇదే అంశాన్ని వాణిజ్య ప్రకటనలు, రియాల్టీ షోల్లో అవి ప్రసారమవుతున్నప్పుడు కింది వైపు చిన్న అక్షరాల్లో ప్రసారం చేస్తున్నారు. నిజజీవితంలో ఎడ్వెంచర్స్‌కు ప్రయత్నిస్తున్న బాలురు, యువత తల్లిదండ్రులకు సమాచారం లేకుండా చేస్తున్నారు. ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర సమయాల్లో ఉపకరించే పరికరాలు, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ‘రంగం’లోకి దిగుతూ ప్రాణాల పైకి తెచ్చుకుంటూ కన్న వారికి కడుపుకోత మిగుల్చుతున్నారని పోలీసులు వివరిస్తున్నారు.

 

శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం
పాతబస్తీలోని యువత, మైనర్లలో ఉన్న కొన్ని ఇబ్బందికర అంశాలను పారద్రోలడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. వేళకాని వేళల్లో రోడ్లపైకి వస్తున్న వారిని, చబుత్రలపై కాలక్షేపం చేస్తున్న వారిని, లేట్ నైట్ రోమియోస్, రహదార్లపై బైక్స్‌తో ఫీట్లు చేసే వారిని నిలువరిస్తున్నాం. వారితో పాటు తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. సినిమాలు, టీవీల్లోని స్టంట్స్ చూసి తమంతట తాముగా స్ఫూర్తి పొందుతూ ప్రాణాల మీదికి తెచ్చే సాహసాలు చేసే టీనేజర్ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. వ్యవస్థీకృతంగా జరిగే వాటిని పోలీసులు ఆపగలిగినా... వ్యక్తిగత అంశాల్లో తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేసే వరకు జోక్యం చేసుకోవడం సాధ్యం కావట్లేదు.  - వి.సత్యనారాయణ, సౌత్ జోన్ డీసీపీ

 

తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి
టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోల ప్రభావం టీనేజర్లపై ఎక్కువగా ఉంటోంది. బాలలు, యువత ‘ఎడ్వెంచర్స్’ బారినపడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వయసుకు మించిన ప్రదర్శనల్ని చూడటానికి అంగీకరించకూడదు. ఇలాంటి వాటిని పిల్లలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు సైతం పక్కనే ఉండాలి. ఆయా షోల్లో ఫీట్లు పిల్లల్ని ఎంత మేరకు ఆకర్షిస్తున్నాయో గమనించాలి. షో ముగిసిన తర్వాత సైతం తల్లిదండ్రులు కాసేపు పిల్లలతో మాట్లాడాలి. షోలో చూసిన అంశాల పట్ల వారి అభిప్రాయం ఏమిటి? వారూ అలాంటివి చేయాలని ఆశిస్తున్నారా? అనే అంశాలు తెలుసుకోవాలి. ఏమాత్రం ఆ ఛాయలు కనిపించినా వాస్తవాలను వారికి వివరించాలి. అలాంటి ఫీట్లు కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే సాధ్యమని, అలానే జరిగాయనేది అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే అపశృతులకు తావు లేకుండా చూసుకోగలం. - డాక్టర్ అనిత రాయిరాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement