సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రికి రూ.5 వేల కోట్లు కేటాయించడం ద్వారా టీఆర్‌ఎస్ కార్యకర్తల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేబినెట్ ఏ ప్రయోజనాల కోసం మం త్రులకు రూ.25 కోట్లు, సీఎంకు రూ.5 వేల కోట్లు కేటాయించిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు ఈ నిధులను కేటాయించుకున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాగ్‌కు ఫిర్యాదుచేస్తామన్నారు.