
సెంచరీకి చేరువలో ఆగిన టీఆర్ఎస్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 'సెంచరీ'కి అడుగు దూరంలో ఆగింది. గ్రేటర్ పోరులో 99 స్థానాలను సాధించడంతో పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో 'వంద' మార్కు చుట్టూనే రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తార స్థాయికి చేరాయి.
టీఆర్ఎస్ వంద సీట్లు గెలుచుకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. మరోవైపు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా టీఆర్ఎస్ 100 డివిజన్లు గెలుచుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.