
కారెక్కి.. క్యాంపులకు..!
- ఇతర రాష్ట్రాలకు స్థానిక ప్రజాప్రతినిధులు
- ఓట్లు కాపాడుకునే పనిలో టీఆర్‌ఎస్ నాయకత్వం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భలే డిమాండ్ తెచ్చిపెట్టాయి. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీ ఆర్‌ఎస్ గూటికి చేరిన వారి మనసు మారకుం డా, మళ్లీ తమ పాత పార్టీల గడప తొక్కకుం డా, ప్రలోభాలకు లొంగకుండా గులాబీ నేతలు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏ జిల్లాలో ఎవరు అభ్యర్థి అనేది ముందే స్పష్టత ఉన్న ఆయా జిల్లాల మంత్రు లు కొంత చొరవ తీసుకుని బృందాలుగా వీరందరినీ విహార యాత్రలకు తరలించారు. అదే సమయంలో సొంత పార్టీ ప్రతినిధులూ నారా జ్ కాకుండా వారినీ క్యాంపులకు పంపించారు. పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న జిల్లాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించేందుకు ముందుగానే మేల్కొన్నారు.
దక్షిణ తెలంగాణలోనే పోటీ తీవ్రం
తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా... ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పోటీ దాదాపు ఏకపక్షమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు అత్యధికంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడం, ప్రతిపక్షాలకున్న కొద్దిమంది టీఆర్‌ఎస్ బాట పట్టడంతో సంఖ్య పెరిగింది. దీంతో ఆయా జిల్లాల మండలి స్థానాల్లో గెలుపుపై టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. కానీ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి వేరు గా ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాం గ్రెస్, టీడీపీలకు టీఆర్‌ఎస్ కంటే ఎక్కువ మం ది ప్రజాప్రతినధులు ఉన్నారు. అయితే, వీరిలో అత్యధికులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరితో పాటు, స్థానిక ఎన్నికల్లో తాము గెలుచుకున్న స్థానాల సంఖ్యను కలుపుకొని తమ అభ్యర్ధుల విజయానికి కావాల్సిన ఓట్లున్నాయని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఖమ్మం జిల్లాలో సీపీఐ అభ్యర్ధికి టీడీపీ, కాంగ్రెస్, సీపీఎంలు మద్దతు ఇస్తుండడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తమకున్న ఓట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో అధికార పార్టీ పడిపోయింది. నల్లగొండ జిల్లాలో మూడు విభాగాల్లో కలిపి 1,102మంది ప్రతినిధులుండగా, కాంగ్రెస్ చేతి లోని 546 మందికి గాను వలసల తర్వాత 400 మందే మిగిలారు. కాగా, కేవలం 136 మందే ప్రతినిధులున్న టీఆర్‌ఎస్ ప్రస్తుతం ఆ సంఖ్య ను 455కు పెంచుకుంది. దీంతో ఇరు పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. వీట న్నింటి దృష్ట్యా ఓట్లు కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.
ఖర్చులు తడిసి మోపెడు
అభ్యర్థిత్వం ఖరారు కాక ముందే నల్లగొండ జిల్లా నుంచి తమ ప్రతినిధులను వివిధ ప్రాంతాలకు తరలించారు. గోవా, కేరళ రాష్ట్రంలోని మునార్, కొచ్చి తదితర ప్రాంతాలకు వీరిని పంపించారు. ఈ ఖర్చంతా అభ్యర్థిపైనే పడనుంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు తమ నమ్మకస్తులతో క్యాంపులు పెట్టించారు. వీరు కూడా కొం త ఖర్చు భరిస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు కనీసం రూ.25లక్షల బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. ఖమ్మం జిల్లా సభ్యులను సోమవారం క్యాంప్‌లకు తరలించనున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా నాయకత్వం క్యాంపుల ఏర్పాటుకు ప్రదేశాలను ఎంపిక చేసినా, కాంగ్రెస్‌తో ఒక్కో సీటు విషయంలో అవగాహన కుద రవచ్చనే అనుమానంతో వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు.