హైదరాబాద్ సిటీ: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. డివిజన్లలో డబ్బు పంచే వారిపై నాయకులు నిఘా పెట్టి పోలీసులకు అప్పగిస్తున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన కుమారస్వామి అనే టీఆర్‌ఎస్ కార్యకర్త సోమవారం ఉదయం రామంతపూర్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణతో కొందరు బీజేపీ కార్యకర్తలు అతణ్ణి పట్టుకుని చితకబాదారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 16 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తరలించారు. తాను టిఫిన్ చేసి బయటకు వస్తుండగా అనవసరంగా పట్టుకుని కొట్టారని కుమారస్వామి పేర్కొన్నాడు. బీజేపీ నాయకులు తమ కార్యకర్తను కొట్టారని టీఆర్‌ఎస్ కార్యకర్తలు రామంతపూర్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.