‘టీఆర్‌ఎస్ నాయకత్వంలో ఉలికిపాటు’
హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వరంగల్ బహిరంగసభలో కొన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నిస్తే, వాటిపై టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు స్పందించిన తీరు వారి ఉలికిపాటును స్పష్టం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా బహిరంగ సభకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ తిరంగాయాత్ర ద్వారా హైదరాబాద్ విముక్తి దినోత్సవం, తదితర అంశాలపై టీఆర్‌ఎస్ అసలు నైజం బయటపడిందని, సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ప్రజలకు అర్థమైందన్నారు. పార్టీకార్యాలయంలో విలీనదినం జరిపి,ప్రభుత్వపరంగా నిర్వహించకపోవడంపై కేసీఆర్ సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ చేతకానితనం, వైఫల్యాలకు కేంద్రంపై నెపం మోపుతారా? ఇది వారి దివాళాకోరుతనానికి నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులపై మంత్రి హరీష్‌రావు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 63 నుంచి 90కు పెంచుకోవడంలోనే ప్రగతి ఉందన్నారు. సెప్టెంబర్ 17ను పార్టీపరంగా నిర్వహిస్తూ, ప్రభుత్వపరంగా నిర్వహించకపోవడంపై కేసీఆర్ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కాశ్మీర్‌లో తిరంగాయాత్ర నిర్వహిస్తే మంచిదని హరీష్‌రావు వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని నిలదీశారు. కేంద్రం నుంచి అందిన సహాయం, నిధుల మళ్లింపు తదితర అంశాలపై అమిత్ షా లేవనెత్తిన అంశాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.