మేయర్ పీఠం టీఆర్ఎస్‌దే!
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు అనూహ్యరీతిలో దూసుకుపోతోంది. తొలి రౌండు నుంచి అత్యధిక డివిజన్లలో టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. తొలి మూడు రౌండ్లలో మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి కావల్సిన పూర్తి మెజారిటీని సాధించే దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ ధాటికి గతంలో మేయర్ పదవి నిర్వహించిన బండ కార్తీకరెడ్డి లాంటి ప్రముఖ అభ్యర్థులు సైతం కంగుతినక తప్పలేదు. తార్నాకలో కార్తీకరెడ్డిపై పోటీచేసిన టీఆర్ఎస్ అభ్యర్థిని సరస్వతి గెలిచారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విక్రమ్ గౌడ్ సైతం ఓడిపోయారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచే లెక్కింపు ప్రారంభమైనా... పురానాపూల్ డివిజన్‌కు రీపోలింగ్ దృష్ట్యా నిర్ణీత సమయం ముగిసే వరకు (సాయంత్రం 5 గంటలు) ఫలితాలను వెల్లడించలేదు. సాయంత్రం 5 గంటల తర్వాతే ఫలితాలను ప్రకటించారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి లెక్కింపు కౌంటర్లకు చేర్చేటప్పటి వరకు మొత్తం కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మొత్తం 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.