
అయ్యో సెంచరీ... జస్ట్ మిస్..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చివరి నిమిషంలో ఉత్కంఠ రేపాయి. ఈ ఫలితాలలో ముందునుంచీ ప్రభంజనం చాటిన టీఆర్‌ఎస్ పార్టీ వందకు పైగా సీట్ల గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి 8.00 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. అప్పటికీ కొన్ని డివిజన్లలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు.
తొమ్మిది గంటల సమయంలో విలేకరులతో మాట్లాడిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సైతం ఇప్పటికే తమ దగ్గరున్న సమాచారం ప్రకారం వందకుపైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భరోసాతో ఉన్నాయి.
కానీ, పది గంటల సమయంలో వెలువడిన తుది ఫలితాలు ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేశాయి. టీఆర్‌ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఒక్క సీటు తేడాతో టీఆర్‌ఎస్ సెంచరీ చేజారినట్లయింది. చివరగా ఓట్ల లెక్కింపు జరిగిన అయిదు డివిజన్లలో ఆఖరి రౌండ్‌లో ఆధిక్యతలు తలకిందులు కావటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అప్పటివరకు సెంచరీ కొడుతామని జోష్‌లో ఉన్న పార్టీ శ్రేణులు అయ్యో సెంచరీ మిస్.. అయ్యిందంటూ నిట్టూర్పు వ్యక్తం చేశాయి.