సమస్తం.. బయో మెట్రిక్
పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ సంస్కరణల బాట
సాక్షి, హైదరాబాద్
పోటీ పరీక్షల నుంచి ఉద్యోగం వచ్చి విధుల్లో చేరే వరకు అన్నింటా బయోమెట్రిక్ విధానం తెచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు నిర్వహించిన మూడు కేటగిరీల పరీక్షలకు బయోమెట్రిక్ విధానం అమలు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇకపై అన్ని పరీక్షలకు దీన్ని తప్పనిసరి చేయనుంది. గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు నాలుగైదు లక్షల మంది అభ్యర్థులు హాజరైనా అంద రికీ బయోమెట్రిక్ విధానం అమలు చేయనుంది. అంతేకాదు.. ఉద్యోగం వచ్చిన వారు విధుల్లో చేరే సమయంలో వేలిముద్ర తీసుకోవడంతోపాటు వారి సర్వీసు రిజిస్టర్లలోనూ ‘థంబ్ ఇంప్రెషన్’ తప్పనిసరిగా ఉండే విధంగా కసరత్తు చేస్తోంది.
సంస్కరణల పథంలో..
పరీక్షల నిర్వహణను టీఎస్‌పీఎస్సీ సంస్కరణ పట్టాలెక్కిస్తోంది. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, అర్హులకు అన్యాయం జరగకుండా చూసేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమైన, సాంకేతికపరమైన పోస్టులకు ఆన్‌లైన్ పరీక్షల విధానం (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్టు - సీబీఆర్‌టీ) అమల్లోకి తెచ్చింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అభ్యర్థుల వీడియో రికార్డింగ్ , వారి డిజిటల్ ఫొటోలు, సంతకాలు తీసుకోవడంతోపాటు వేలి ముద్రలు సైతం సేకరిస్తోంది. తద్వారా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా చూడొచ్చని, పరీక్షలకు హాజరైన వారే ఇంటర్వ్యూలకు వచ్చేలా చేయొచ్చని భావిస్తోంది.
పరీక్ష కేంద్రంలో తీసుకునే ఫొటోలు, వేలి ముద్రలు, సంతకాలను ఇంటర్వ్యూ సమయంలో పోల్చి చూడటం ద్వారా పొరపాట్లకు ఎలాంటి అవకాశం ఉండదు. అలాగే ఇంటర్వ్యూలు లేని పరీక్షల్లో... పరీక్ష రాసిన వారెవరు? ఉద్యోగంలో చేరుతున్న వారెవరు? అన్న విషయాలను తేల్చేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడనుంది. ఉద్యోగంలో చే రిన తర్వాత వేలిముద్ర తీసుకుంటే మరింత మంచిదన్న ఆలోచనల్లో టీఎస్‌పీఎస్సీ ఉంది. వారి సర్వీసు రిజిస్టర్‌లో వేలిముద్ర ఉంటే ఏ దశలోనైనా క్రాస్ చెక్ చేయొచ్చని భావిస్తోంది.
ప్రతి పరీక్ష హాల్లో సీసీటీవీ
పోటీ పరీక్ష నిర్వహించే ప్రతి గదిలో సీసీటీవీలు ఉండేలా చూడాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుతం ప్రతి తరగతి గదిలో సీసీటీవీ ఉన్న కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ర్యాగింగ్ నిరోధంలో భాగంగా ప్రతి కాలేజీ.. అన్ని తరగతి గ దుల్లో సీసీటీవీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ద్వారా ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. ఫలితంగా భవిష్యత్తులో పరీక్షలన్నింటినీ నిఘా నేత్రం నీడన నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని యోచిస్తోంది.
సీబీఆర్‌టీలో ఎన్నో ప్రత్యేకతలు
టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ టెస్టు (ఆన్ లైన్) పరీక్ష విధానాన్ని తీసుకువచ్చింది. దీనిద్వారా నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి నెల రోజుల్లో పరీక్షలను పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా చర్యలు చేపట్టింది. అంతేకాదు పరీక్ష జరిగిన మరుసటి రోజే అభ్యర్థులు వారి జవాబు పత్రాలు పొందేలా వీలు కల్పిస్తోంది. కమిషన్ ఇచ్చే ప్రత్యేక లింకు ద్వారా అభ్యర్థులు వారి జవాబు పత్రాన్ని పొందవచ్చు. అలాగే జవాబుల కీని కూడా పరీక్ష మరుసటి రోజే ప్రకటిస్తోంది. అంతేకాకుండా పరీక్ష సమయంలో అభ్యర్థులు మొదట ఒక ఆప్షన్‌ను ఎంచుకొని, ఆ తర్వాత మార్చుకునే వీలు కల్పిస్తోంది. చివరగా ఫైనల్ సబ్మిట్ ఆప్షన్‌ను అందిస్తోంది. ఇందులో మరో సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది. పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులు ఐదు నిమిషాలు కనుక రాయకుండా (మౌస్ ద్వారా ఆప్షన్లు క్లిక్ చేయకుండా ఉంటే) ఉంటే ఆటోమెటిక్‌గా కనెక్షన్ నిలిచిపోతుంది.
సదరు అభ్యర్థి మళ్లీ కొనసాగించాలంటే.. పరీక్ష కేంద్రంలోని అబ్జర్వర్ ఓకే చెప్పాలి. దీంతో ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు వచ్చి పరీక్ష రాసే వీలు ఉండదు. ప్రస్తుతం సీబీఆర్‌టీని 30 వేల లోపు దరఖాస్తులు వచ్చిన పరీక్షలకే అమలు చేసే సదుపాయాలు ఉన్నాయి. ఐటీ శాఖ నేతృత్వంలో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, కంప్యూటర్లు ఏర్పాటు చేయడం, తెలంగాణ స్టేట్ డాటా సెంటర్ ఏర్పాటు చేసి, టీఎస్‌పీఎస్సీ పరీక్షలను దాంతో అనుసంధానం చేస్తే ఎన్ని వేల మందికైనా ఆన్ లైన్ పరీక్షలను సులభంగా నిర్వహించవచ్చని యోచిస్తోంది.
ప్రశ్నజవాబులన్నీ జంబ్లింగే!
ఒకరి పేపర్ మరొకరు చూసి రాసేందుకు వీల్లేకుండా పరీక్షల్లో ప్రతి ప్రశ్న, ప్రతి జవాబును కూడా కమిషన్ జంబ్లింగ్ విధానంలోనే ఇస్తోంది. పరీక్ష హాల్లో ఏ ఒక్క అభ్యర్థి పేపరులోని ప్రశ్నలు, అప్షన్ల వరుస క్రమం మరో విద్యార్థికి ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు, జవాబుల ఆప్షన్లతో కలువకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పక్కా పర్యవేక్షణ
టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పక్కా పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. పరీక్ష కేంద్రంలో ఏం జరిగినా వెంటనే కమాండ్ సెంటర్‌లో తెలిసిపోయేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసింది. ఏదైనా కేంద్రంలో ఒక విద్యార్థి పరీక్ష రాయడం ఆపేసినా వెంటనే ఇక్కడి తెలిసేలా చర్యలు చేపట్టింది. తద్వారా ఏ సమస్య వచ్చినా వెంటనే చర్యలు చేపట్టవచ్చని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.