సాక్షి, హైదరాబాద్: కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించాలని నీటి పారుదల శాఖ స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ) నిర్ణయం తీసుకుంది. కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ విధివిధానాలను అనుసరించి, 2012-13 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారమే బ్యారేజీ నిర్మాణ పనులను చేస్తామంటూ పాత కాంట్రాక్టు సంస్థ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం చేసింది. తుపాకులగూడెం పనులకు కొత్తగా టెండర్లు పిలవాలా? లేక పాతవారికే అప్పగించాలా? అన్న అంశంపై శుక్రవారం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, సీడీవో నరేందర్‌రెడ్డి, ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లుతో కూడిన కమిటీ సమావేశమయింది.
కంతనపల్లి బ్యారేజీ వాస్తవ అంచనా, ప్రస్తుత బ్యారేజీ అంచనా, పాత కాంట్రాక్టర్ కోట్ చేసిన ధర తదితరాలపై చర్చించింది. కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూ.1,809 కోట్లతో అంచనా ఉండగా దాన్ని సదరు కాంట్రాక్టు సంస్థ 9 శాతం లెస్‌తో రూ.1,643.67 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం తుపాకులగూడెం బ్యారేజీ అంచనాను 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం రూ.1,864.62 కోట్లుగా నిర్ణయించగా, 2012-13 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం రూ.1,666.80 కోట్లుగా లెక్కించారు. పాత ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారమే పనులు చేస్తామనడంతో రూ.1,666.80 కోట్లనే బ్యారేజీ వ్యయంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మొత్తానికి సైతం కంతనపల్లి బ్యారేజీకి కోట్ చేసిన 9 శాతం లెస్‌ను కలిపి వ్యయం నిర్ణయించడంతో అది రూ.1,514.47 కోట్లకు చేరింది. ఇలా చేయడంతో బ్యారేజీ వ్యయ భారం దాదాపు రూ.350.15 కోట్ల మేరకు తగ్గుతుండటంతో పాత కాంట్రాక్టర్‌కే అప్పగించాలని నిర్ణయం చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.
తుపాకులగూడెం కాంట్రాక్టుకు లైన్ క్లియర్
Published Sat, May 21 2016 4:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM
Advertisement
Advertisement