
ఎన్నాళ్లీ పా 'పాలు'!
గ్రేటర్‌లో ప్రశ్నార్థకంగా మారిన పాల నాణ్యత
మార్కెట్ వాటాపై దృష్టి
{పైవేటు డెయిరీల మధ్య అనారోగ్యకర పోటీ
చోద్యం చూస్తున్న సర్కారు విభాగాలు
మార్కెట్ వాటాపై ధ్యాస.. లాభాలపై ఆశ... అక్రమాలే శ్వాస...ఇదీ నగరంలోని వివిధ డెయిరీల తీరు. వినియోగదారుల సంఖ్యపై దృష్టి పెట్టిన ఈ సంస్థలు... నాణ్యమైన పాలు అందించాలన్న విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాయి. ప్రజలను అనారోగ్యం బారిన పడేస్తున్నాయి.
సిటీబ్యూరో: గ్రేటర్‌లో పాల వ్యాపారం చేస్తున్న ప్రైవేటు డెయిరీల మధ్య అనారోగ్యకర పోటీ నెలకొంది. మార్కెట్‌లో అత్యధిక అమ్మకం వాటా దక్కించుకునేందుకు ఇవి ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. పంపిణీదారులకు అధిక కమీషన్లు ఆశ చూపుతూ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యతకు నీళ్లొదులుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహార రక్షణ, ప్రమాణాల చట్టం(2006) నిబంధనలను తుంగలో తొక్కి పాల ఉత్పత్తి, పంపిణీదారులు వ్యాపారం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. దీన్ని జీహెచ్‌ఎంసీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాలు చోద్యం చూస్తుండడం గమనార్హం. మరోవైపు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన గుజరాత్ బ్రాండ్ అమూల్ పాలు నగర మార్కెట్‌లోకి ప్రవేశించడంతో చిన్న డెయిరీల వ్యాపారం దెబ్బ తింటుందని వాటి నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.
నాణ్యతకు నీళ్లు
మహా నగరంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలకు చెందిన సుమారు 25 లక్షల లీటర్లకు పైగా ప్యాకెట్ పాలు, పాల సంబంధ ఉత్పత్తులైన పెరుగు, పన్నీరు, నెయ్యి వంటివి అమ్ముడవుతున్నట్లు అంచనా. ఇందులో ప్రభుత్వ డెయిరీలు విక్రయిస్తున్నవి 30 శాతమే. మహా నగర పరిధిలో నిత్యం వెయ్యి నుంచి 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీలకు చెందిన సుమారు 57 రకాల పాల బ్రాండ్లు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. లీటరు పాలలో వెన్న శాతాన్ని బట్టి వినియోగదారునికి రూ.38 నుంచి రూ.54 ధరకు విక్రయిస్తున్నాయి. డెయిరీల యాజమాన్యాలు ఎవరికి వారు తమ బ్రాండు పాలను అధిక మొత్తంలో విక్రయించేందుకు డిస్ట్రిబ్యూటర్లకు లీటరుకు రూ.2 నుంచి రూ.5 వరకు కమీషను ఆశచూపి తమ వైపు తిప్పుకుంటున్నారు. మార్కెట్ లో అధిక మొత్తంలో పాలను విక్రయించడం... భారీగా లాభాలు ఆర్జించడం... పంపిణీదారులను తమ వైపు తిప్పుకోవడంపైనే దృష్టి సారిస్తున్న సంస్థలు నాణ్యతపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అమూల్ రాకతో బెంబేలు...
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన గుజరాత్ అమూల్ పాల బ్రాండ్ నగర మార్కెట్‌లోకి ప్రవేశించడం చిన్న డెయిరీల నిర్వాహకులను బెంబేలెత్తిస్తోంది. ఆ సంస్థ నగరంలో నిత్యం 50 వేల లీటర్ల పాలను విక్రయిస్తోంది. మార్కెట్ వాటా పెంచుకునేందుకు నగరంలో తమ పాలను మాత్రమే విక్రయించే డిస్ట్రిబ్యూటర్లకు అధిక మొత్తంలో కమీషన్లు ముట్టజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామంతో నగరంలోని చిన్న డెయిరీలకు నష్టం తథ్యమని నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రోగాల పాలు...
నగరంలో విక్రయిస్తున్న పాల ప్యాకెట్లలో జీర్ణకోశ వ్యాధులకు కారణమయ్యే ఇ.కోలి, టైఫాయిడ్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాలతోపాటు కళ్లు, మెదడుకు హాని తల పెట్టే యూరియా ఆనవాళ్లు బయటపడుతున్నాయి.డెయిరీల నిర్వాహకులు పాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. వీటితో మెదడు, నరాలు, జీర్ణకోశవ్యవస్థ దెబ్బ తింటుంది. కొన్ని ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు గేదెలు అధిక పాలు ఇచ్చేందుకు పరిమితికి మించి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తుండడంతో వాటి ఆనవాళ్లు పాలల్లో కలిసిపోతున్నాయి. ఈ పాలను తాగిన పిల్లల్లో అసాధారణ పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి అనర్థాలు తలెత్తుతున్నాయి.
నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు డెయిరీల నిర్వాహకులు పాలు, పెరుగు, పన్నీరుల్లో కలిపే పౌడరు నాణ్యత లేనిది వాడుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టడంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు విఫలమవుతున్నారు. డెయిరీల్లో సరైన వసతులు, నిపుణులు లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో జనం రోగాల పాలు కావాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. నగరంలో విక్రయించే డబుల్ టోన్డ్, టోన్డ్, స్టాండర్డ్, హోల్ మిల్క్ ప్యాకెట్ల తయారీలో ఆహార రక్షణ చట్టం నిబంధనలను కంపెనీలు పాటించడం లేదు. పాలల్లో కొవ్వు శాతం, కరిగిన ఘన పదార్థాలను సంతృప్త స్థాయిలో ఉంచడం, బాక్టీరియా ఆనవాళ్లను తొలగించే విషయంలో డెయిరీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
టాస్క్‌ఫోర్స్ కమిటీ అవసరం
నగరంలో విక్రయిస్తున్న ప్రైవేటు డెయిరీల పాల నాణ్యత తనిఖీకి సాంకేతిక నిపుణులతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు, గుర్తింపు లేని కంపెనీలకు చెందిన పాల పౌడరు కలుపుతున్న డెయిరీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి. కల్తీ ఆనవాళ్లు బయట పడితే ఆ డెయిరీలను మూసేయాలి.
- ఎస్‌వీడీబీఆర్ కృష్ణారెడ్డి, సీనియర్ డెయిరీ టెక్నాలజిస్టు
అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలి
పాలల్లో క ల్తీకి పాల్పడుతున్న డెయిరీలు, వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. సాల్మొనెల్లా, యూరియా, ఇ.కోలి ఆనవాళ్లున్న పాలు తాగిన పిల్లల కళ్లు, మెదడు, జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై ఫుడ్ యాక్ట్-34 ప్రకారం చర్యలు చేపట్టాలి.
- అనురాధరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు