రంగారెడ్డి: తప్పుడు చిరునామాతో ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను శంషాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని యాకుత్‌పుర వాసి సయ్యద్ అమానుల్లా అలియాస్ అజీం(27), రాజేంద్రనగర్ సులేమాన్ ప్రాంతానికి చెందిన బి.శీష్‌కుమార్(29) స్నేహితులు. శీష్‌కుమార్ గతంలో అమెజాన్ కంపెనీలో కొరియర్ బాయ్‌గా పని చేయగా.. అజీం చిరు వ్యాపారం చేస్తుంటాడు. నెలక్రితం అమెజాన్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన శీష్‌కుమార్.. స్నేహితుడితో కలసి దోపిడీకి పథకం వేశాడు.
జనవరి 24న ఆన్‌లైన్‌లో అమెజాన్ కంపెనీకు ట్రిమ్మర్ ఆర్డర్ చేశారు. ఐఎంటీ కళాశాల విద్యార్థి రాకేష్ పేరుతో ఆర్డర్ చేసి వీరి సెల్ నంబరు ఇచ్చారు. జనవరి 26న కంపెనీకి చెందిన కొరియర్ బాయ్ ఫయీమ్ వీరి సెల్‌కు కాల్ చేసి కళాశాల వద్ద ఉన్నట్లు చెప్పాడు. దీంతో హమీదుల్లానగర్ సమీపంలో ఔటర్ రింగు రోడ్డు డెలివరీ బాయ్ను కలిశారు.
అతడి వద్ద ఉన్న బ్యాగు, సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం తొండుపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన అజీం, శీష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద బైక్‌తో పాటు అమెజాన్ కంపెనీకి చెందిన బ్యాగులోని 23 ఆర్డరు బాక్స్‌లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను స్టేషన్కు తరలించారు.