
ఉండవల్లివి ఊహాజనిత కథలు: జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రచించిన పుస్తకం.. ఊహాజనిత కథలతో కూడినదని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. పిచ్చి ఊహలతో పుస్తకాలు రాయడం పొరపాటని ఆయన మండిపడ్డారు. మాజీ ఎంపీలు బలరాం నాయక్, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ శెట్కార్, మధుయాష్కీ గౌడ్‌లతో కలసి బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విభజనకు సంబంధించిన బిల్లు పాస్ కాలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఉండవల్లి వాదన పూర్తి అవాస్తవమైనదన్నారు. యూపీఏ, ఎన్డీయే పక్షాల పూర్తి మద్దతుతో బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిందన్నారు.
పార్లమెంట్ నిబంధన 367(1)(సి) ప్రకారం బిల్లుకు అనుకూలం, ప్రతికూలం గల సభ్యుల పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో కూడా విజయం సాధిస్తామన్నారు. లోక్‌సభ స్పీకర్ చాంబర్‌లో అప్పటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌తో తమ మధ్య ఒప్పందం జరిగిందన్నారు. ఆమె ఇచ్చిన హామీతోనే బిల్లును సభలో ప్రవేశపెట్టామన్నారు. స్పీకర్ చాంబర్ వద్ద జరిగిన చర్చ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా తెలియదన్నారు.
లోక్‌సభ ప్రసారాలను తాను నిలిపేయించానని ఉండవల్లి పేర్కొనడం అబద్ధమన్నారు. విభజన సమయంలో సీఎం ఎవరవుతారనే రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేదని.. ప్రజల ఆకాంక్ష, ఆత్మహత్యలను నివారించడం కోసమే తాము ప్రయత్నించామన్నారు. ఉండవల్లి పుస్తకంలో తనను అత్యుత్తమ మేధావి, అజాత శత్రువు అంటూ పొగిడినందుకు జైపాల్‌రెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.