
నన్నూ ఈ కేసులో చేర్చుకోండి...
ఓటుకు కోట్లు కేసులో ఉండవల్లి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో దర్యాప్తునకు ఆదేశిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన వ్యాజ్యంలో తననూ ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని అభ్యర్థిస్తూ మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో తెలంగాణ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో పలుమార్లు చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారని ఉండవల్లి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆయనను నిందితునిగా చేర్చడం గానీ, సాక్షిగా విచారించడం గానీ చేయలేదని వివరించారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తన వాదనలను వినాలని ఆయన అభ్యర్థించారు.