ప్రొఫెసర్లకే వీసీ చాన్స్ | VC Chance to the Professors itself | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్లకే వీసీ చాన్స్

Published Tue, Jul 12 2016 4:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

VC Chance to the Professors itself

ఐఏఎస్, ఐపీఎస్‌లను నియమించే ఆలోచన వెనక్కి

 సాక్షి, హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ జడ్జిలను యూనివర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్లుగా నియమించాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లకే వాటిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా సెర్చ్ కమిటీలు ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లతో కూడిన జాబితాను సీఎంకు పంపనున్నట్టు తెలిసింది. ఉస్మానియా, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలకు వీసీల ఎంపికకు నియమించిన సెర్చ్ కమిటీల సమావేశాల్లో ఈ అంశంపైనా చర్చించాయి. ఒక్కో వర్సిటీ వీసీ పోస్టుకు ముగ్గురు ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లతో జాబితాలను పంపించినట్లు తెలిసింది. ఓయూ వీసీ పోస్టుకు అదే వర్సిటీ ఫిజిక్స్ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ సాయన్న, మరొకరు నర్సింహారెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రాంచంద్రం పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో సాయన్న పేరునే సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. నల్లగొండ మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ఇప్పటికే అల్తాఫ్ హుస్సేన్‌ను నియమించింది. మిగతా వర్సిటీలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సెర్చ్ కమిటీలు ఈ నెల 16 వరకు సమావేశం కాబోతున్నాయి.

 12న తెలుగు వర్సిటీ, 13న పాలమూరు వర్సిటీ, 14న శాతవాహన వర్సిటీ, 15న తెలంగాణ వర్సిటీ, 16న కాకతీయ వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.  జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ఆర్‌జీయూకేటీల సెర్చ్ కమిటీల సమావే శాలూ త్వరగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 20 లోగా వీసీల నియామకం పూర్తవుతుందని అంచనా. ప్రొఫెసర్ల అనుభవం నిబంధనను ఐదేళ్లకు సడలించినా, పదేళ్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తెలిసింది.

 ఆ మూడింటికీ నేరుగా నియామకాలు...
 కాళోజీ హెల్త్ వర్సిటీకి కరుణాకర్‌రెడ్డిని నేరుగా నియమించిన ప్రభుత్వం.. అగ్రి కల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీలకు అదే తరహాలో వీసీలను నియమిం చేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అగ్రికల్చర్ వర్సిటీ స్పెషలాఫీసర్‌గా ఉన్న ప్రవీణ్‌రావును ఆ వర్సిటీ వీసీగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement