వీణావాణీలు ఇంటికే! | veena vani to the home | Sakshi
Sakshi News home page

వీణావాణీలు ఇంటికే!

Published Sat, Jun 11 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

వీణావాణీలు ఇంటికే!

వీణావాణీలు ఇంటికే!

- శస్త్రచికిత్స చేయించలేమని చేతులెత్తేసిన సర్కారు
- ఆర్థికసాయం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలకు శస్త్రచికిత్స చేయించలేమని సర్కారు చేతులెత్తేసింది. శస్త్రచికిత్స చేయించడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని, అందువల్ల వారిని ఇంటికే పంపిస్తామని ప్రకటించింది. వీణావాణీలను వేరు చేస్తామని లండన్ వైద్యులు చెప్పినా.. కేవలం ఎయిమ్స్ నివేదికపై ఆధారపడి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఎయిమ్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వీణావాణీలకు ఆపరేషన్ చేయడం రిస్క్‌గా భావిస్తున్నాం. మరోసారి వైద్య పరీక్షల ఆలోచన సర్కారుకు లేదు. వారిని నీలోఫర్‌లో ఉంచడం కష్టం. కాబట్టి వారిని తల్లిదండ్రుల వద్దకు పంపిస్తాం. పిల్లలను చూసుకునే ఆర్థిక స్థోమత లేదని తల్లిదండ్రులు చెబుతున్నందున ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. అలాగే వీణావాణీలకు ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చే ఆలోచన ఉంది. వారి చదువు, ఆరోగ్యం, వైద్యం కోసం కూడా సాయం చేస్తాం..’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శరీరం అతుక్కుని పుట్టి 14 ఏళ్లుగా ఎన్నో బాధలు అనుభవిస్తున్న వీణావాణీల కథ ఇంటికి చేరింది.

 హైదరాబాద్‌లోనే పరీక్షలు..
 వీణావాణీలకు శస్త్రచికిత్స అంశంపై సర్కారు గతేడాది లండన్ వైద్యులను పిలిపించి హడావుడి చేసింది. అయితే రూ.10 కోట్లు ఖర్చవుతుందని వారు తేల్చగానే ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి సలహా అంటూ వెనక్కి తగ్గిందన్న ఆరోపణలున్నాయి. కానీ ఎయిమ్స్‌లోనైనా పరీక్షలు చేశారా అంటే అదీ లేదు. నీలోఫర్ ఆస్పత్రి పక్కనే ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో పరీక్షలు చేసి, వాటిని ఎయిమ్స్‌కు నివేదించారు. అంతర్జాతీయ స్థాయిలో చేయాల్సిన వైద్య పరీక్షలను ఇక్కడికే పరిమితం చేశారు. ఆ నివేదికలను పట్టుకుని ఎయిమ్స్ నిపుణులు ‘శస్త్ర చికిత్స చేయగలం. కానీ ప్రాణాలకు ప్రమాదం’ అని ప్రకటించారు. అసలు లండన్ వైద్యులు శస్త్రచికిత్స చేస్తామని చెప్పాక కూడా ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
 
 ఆర్థికసాయం చేస్తే తీసుకెళ్తాం వీణావాణీల తల్లిదండ్రులు
 తాము కూలీ చేసి బతుకుతున్నామని, ఇప్పు డు తమ వద్ద ఉన్న ఇద్దరు పిల్లలనే కష్టపడి పోషిస్తున్నామని వీణావాణీల తండ్రి మురళి పేర్కొన్నారు. వీణావాణీలను తీసుకెళ్లాలని నీలోఫర్ వైద్యులు చెప్పారని.. తాము సమ యం కావాలని కోరామని చెప్పారు. వీణావాణీలను సరిగా చూసుకునే ఆర్థిక స్థోమత తమకులేదని.. వారికి మంచి ఆహారం, విద్య, వైద్యం అందించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి, సదుపాయాలు కల్పిస్తే వీణావాణీలను తీసుకెళ్లి కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement