
వెంకయ్య డైరెక్షన్, బాబు స్క్రీన్ ప్లే, సుజనా యాక్టింగ్
హైదరాబాద్ : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు డైరెక్షన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్క్రీన్ ప్లే చేయగా..కేంద్ర మంత్రి సుజనా చౌదరి యాక్టర్‌గా ప్రత్యేక హోదాకు సమాధి కట్టారు. 26 నెలలపాటు ఢిల్లీలో నటించిన టీడీపీ, బీజేపీ నేతలు మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా అనే సినిమాకు కనీసం ముహూర్తపు షాట్ కూడా కొట్టలేకపోయారు. ఎన్నికలకు ముందు నుంచి ప్రత్యేక హోదాపై ఆరు కోట్ల ఆంధ్రులను నమ్మిస్తూ వచ్చినా టీడీపీ, బీజేపీ నేతలు హోదాపై చేతులు ఎత్తేసినట్లు సుజనా చౌదరి మాటల్లో తేటతెల్లమైంది.
దీంతో చాలా రోజులుగా ప్యాకేజీ జపం చేస్తున్న చంద్రబాబు మాటలకు అనుగుణంగానే కేంద్రం అడుగులు పడుతున్నాయి. ప్రత్యేక హోదా ఇమ్మంటే... అలాంటిదే ప్యాకేజీ అంటూ నాలుగు రోజులుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని పెద్దలు హడావుడి మొదలుపెట్టారు. చివరకు సీఎం చంద్రబాబు కూడా హోదా వద్దు...ప్యాకేజీనే ముద్దు అన్నట్టుగా ఓకే చేసేశారన్న ప్రచారం సాగుతోంది.
సోమవారం నుంచి ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరపైకి రావడంతో..ఆ అంశాన్ని పక్కకు మళ్లించేందుకు వాళ్లను..వీళ్లను కలుస్తున్నట్లు నాటకమాడిన కేంద్రమంత్రి సుజనా చౌదరి ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టి చావుకబురు చల్లగా చెప్పారు. ప్రత్యేక హోదాతో సమానమైన సాయం చేయడానికి కసరత్తు జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు బహిరంగ సభల్లో పదేళ్లు ..కాదు పదిహేను ఏళ్లు అంటూ ప్రసంగాలు దంచిన చంద్రబాబు, వెంకయ్య మాటలు ఓట్ల మాటలేనని తేలిపోయింది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సుజనా చౌదరి ఐదేళ్లు ప్రత్యేక హోదాను కేంద్రాన్ని అడుగుతున్నట్లు చెప్పారు. మొత్తం మీద ...చంద్రబాబు, వెంకయ్య నాయుళ్లు ప్రత్యేక హోదాకు ఢిల్లీలో సమాధి కట్టారు.