సోనియా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయస్థానం తన ముందు హాజరవ్వాలని ఆదేశిస్తే గౌరవించి న్యాయస్థానం ముందు హాజరై వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఊరేగింపులు, ప్రదర్శనలు చేయడం తగునా అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తమపై కేసు నమోదుకు ప్రధాని మోదీ కారణమని సోనియా ఆరోపించడం సరికాదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు 2012-13లో నమోదైందని గుర్తు చేశారు. వారు ఏది మాట్లాడినా వాటికి బాధ్యుడు అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ అవుతారన్నారు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కోపంతో పార్లమెంట్ జరగనీయకుండా ఆ పార్టీ ప్రజలపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తోందని వెంకయ్య ఆరోపించారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో 18 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని గుడ్డిగా ఆమోదించమని చెప్పను గానీ, పార్లమెంట్‌ను సజావుగా జరగనీయాలని విజ్ఞఫ్తి చేశారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న యజ్ఞానికి హాజరవుతానని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.