ప్రభుత్వ ప్లీడర్లు అసమర్థులు
అసెంబ్లీలో విష్ణుకుమార్‌రాజు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్లీడర్లు అసమర్థులని, వారిని నియమించే తీరు బాగాలేదని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఎవరిని పడితే వారిని నియమించుకోవడం వల్ల రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటుపరం అవుతున్నాయన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన భూముల కబ్జాపై మాట్లాడారు. ప్రభుత్వ ప్లీడర్ల నియామకపు వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు.
భూకబ్జాలు, ఇనాం భూములు, గ్రామకంఠాలు వంటి వాటిపై టీడీపీ సభ్యులు జవహర్, శ్రావణ్‌కుమార్, కూన రవికుమార్ తదితరులు మాట్లాడారు. ఇనాం భూములపై స్పష్టత లేని కారణంగా వేలాది మంది ఇన్‌పుట్ సబ్సీడీలు, పంటరుణాలు పొందలేక పోతున్నారని, వీటిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఫిర్యాదులొస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని సభ్యుల ప్రశ్నలకు రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానమిచ్చారు.