బాంబే గ్రూపు రక్తం కోసం ఎదురుచూపులు.. | waiting for Bombay blood group | Sakshi
Sakshi News home page

బాంబే గ్రూపు రక్తం కోసం ఎదురుచూపులు..

Sep 15 2016 1:01 AM | Updated on Sep 4 2017 1:29 PM

బాంబే గ్రూపు రక్తం కోసం ఎదురుచూపులు..

బాంబే గ్రూపు రక్తం కోసం ఎదురుచూపులు..

అరుదైన బాంబే గ్రూపు రక్తం కోసం ప్రాణాపాయస్ధితిలో రోగి ఎదురుచూస్తోంది.

అరుదైన బాంబే గ్రూపు రక్తం కోసం ప్రాణాపాయస్ధితిలో రోగి ఎదురుచూస్తోంది. మిలియన్ ప్రజల్లో కేవలం నలుగురికి మాత్రమే ఉంటే ఈ రకం బ్లడ్‌గ్రూపు రక్తం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అరుదైన బాంబే గ్రూపు రక్తాన్ని సేకరించి రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమారం గ్రామానికి చెందిన విజయలక్ష్మీ, ఆదంలు భార్యభర్తలు. రెండో సారి గర్భం దాల్చిన విజయలక్ష్మీకి స్థానిక జిల్లా వైద్యులు వైద్యసేవలు అందించారు. అమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌గ్రూపని తేలడంలో ఈనెల 13వ తేదిన గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడడంతో శస్ర్తచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీశారు. అప్పటికే శిశువు మృతి చెందింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమైంది. తక్షణమే రెండు బ్యాటిళ్ల రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. అయితే అమె రక్తానికి మ్యాచ్ అయ్యే బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అందుబాటులో లేదు. శతవిధాల ప్రయత్నించగా చార్మినార్ తలసేమియా బ్లడ్‌బ్యాంకులో ఒక బ్యాటిల్ రక్తం ఉందని తెలుసుకుని తక్షణమే అక్కడి నుంచి కొలుగోలు చేశారు.

 మరో బ్యాటిల్ రక్తం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలోనే విజయలక్ష్మీ మోకాలిచిప్పకు శస్ర్తచికిత్స అవసరమైన నేపధ్యంలో ఆమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌గ్రూపు రక్తంగా వైద్యులు గుర్తించారు. నిమ్స్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు వేచిఉన్న తర్వాత బాంబే బ్లడ్‌గ్రూపు రక్తాన్ని ముంబై నుంచి సేకరించిన అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి అధికారులు ముంబైలోని మహాత్మగాంధీ సేవసమితి బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న విజయలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు తమవంతు కషిచేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. ఈ రకం రక్తాన్ని గుర్తించేందుకు గాంధీ బ్లడ్‌బ్యాంకులో తగిన వైద్యపరికరాలు ఉన్నాయని, ఇక్కడకు వచ్చే రక్తదాతల్లో బాంబే బ్లడ్‌గ్రూప్ రక్తం ఉన్నవారు ఎవరూలేరని గాంధీ బ్లడ్‌బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ భీష్మ తెలిపారు.

బాంబే బ్లడ్ గ్రూప్ అంటే...
జన్యుపరంగా సంక్రమించే ఈ రకం బ్లడ్‌గ్రూప్‌ను ముంబై(ఒకప్పటి బొంబాయ్‌)కు చెందిన డాక్టర్ వైఎం బెండీ 1952లో గుర్తించారు. దీంతో ఈ రకం రక్తానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని నామకరణం చేశారు. అత్యంత అరుదైన ఈ రక్తం ఓ నెగిటివ్ గ్రూప్‌లోని మరో సబ్‌టైప్. దీనికి వైద్యపరిభాషలో ‘ఓహెచ్’గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం మిలియన్ మందిలో నలుగురికి మాత్రమే ఉండే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు.

దేశంలో తొమ్మిది మందికి అవసరం...
దేశంలో తొమ్మిది మందికి బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరం ఉందని తేలింది. కొంతమంది కలిసి బాంబే బ్లడ్‌గ్రూప్ డాట్ ఓఆర్‌జీ పేరిట ఓ వైబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బ్లడ్ అవసరమైన వారు ఈ వైబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకుంటే డోనర్లను వెతికి పట్టుకుని అవసరమైన రక్తాన్ని అందిస్తారు. ప్రస్థుతం ఈ వెబ్‌సైట్‌లో తొమ్మిది మంది తమకు బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమని తమపేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బేబీ సరియాఅమీన్, అనంతపురంకు చెందిన శైలజలు ఉండడం గమనార్హం. ఈ వెబ్‌సైట్ విశ్లేషణ ప్రకారం మహారాష్ట్రలోనే ఈ బ్లడ్‌గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement