బీజేపీకి హై ఓల్టేజీ షాకివ్వాలి | want to give hi voltage shock to bjp | Sakshi
Sakshi News home page

బీజేపీకి హై ఓల్టేజీ షాకివ్వాలి

Published Thu, Jan 28 2016 3:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీకి హై ఓల్టేజీ షాకివ్వాలి - Sakshi

బీజేపీకి హై ఓల్టేజీ షాకివ్వాలి

హైదరాబాద్ అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదు
టీయూడబ్ల్యూజే ‘మీట్ ద ప్రెస్’లో ఎంపీ కవిత


హైదరాబాద్: ‘బల్దియా ఎన్నికల్లో బీజేపీకి హైవోల్టేజీ షాకివ్వాలి. మతతత్వ శక్తులకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలి. బీజేపీ నేతలకు చిత్తశుద్ధిలేదు. ప్యాకేజీ.. లీకేజి అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రాస కోసం పాకులాడుతున్నారు తప్ప నగరంలో చేసిన అభివృద్ధేమీ లేదు. హైదరాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారు. బీజేపీ, టీడీపీలు ఇక్కడ అలజడి సృష్టించేందుకు చూస్తున్నాయి. రాష్ట్రంలో శాంతియుతంగా పాలన సాగుతుంటే ఓర్వలేని నాయకులు నగరంలో ఏదైనా జరిగితే బావుండనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

తండ్రి స్థానంలో ఉన్న కేంద్రం అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సింది పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను అటు, ఇటుగా మార్చి టీడీపీ, బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది’ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ బుధవారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు... 

లోకం తెలియని లోకేశ్...
హైదరాబాద్‌లో ఉన్నవారంతా హైదరాబాదీలే. ఇతర పార్టీల బలహీనతలను ఎత్తిచూపకుండా 19 నెలల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థిస్తున్నాం. కేసీఆర్ పాలనపై ప్రజలందరూ విశ్వాసంతో ఉన్నారు. మా నాన్న, తాతల హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ లోకం తెలియని లోకేశ్‌బాబు ప్రచారం చేయడం సరికాదు. తెలంగాణ 1956కు ముందే పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను విమర్శించడం లేదు గానీ, అదే సమయంలో హై టెక్ సిటీ కట్టి అభివృద్ధంతా మావల్లేనని ప్రకటించుకోవడం సరికాదు. వ్యక్తిగత అభివృద్ధి కోసం హైటెక్ సిటీని ఉపయోగించుకున్నారు.

కులమతాలు, ప్రాంతాలకతీతంగా...
కుల మతాలకతీతంగా మా ప్రభుత్వం అన్ని పండుగలనూ ఘనంగా నిర్వహిస్తోంది. పార్టీలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ అభివృద్ధి నిధులు మం జూరు చేస్తోంది. హైదరాబాద్‌లో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చాం. గోదావరి జలాలను నగరానికి తరలించాం. ‘మన నగరం.. మన పార్టీయే’ మా నినాదం. మేయర్ పదవిలో టీఆర్‌ఎస్ ఉంటేనే హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది.

 రాష్ట్రం ఏర్పడితే ఇతర ప్రాంతాల వారికి భద్రత ఉండదు.. ఆంధ్ర వారిని తరిమేస్తారని తప్పుడు ప్రచారాలు చేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తూన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలకు వాళ్ల అధినాయకత్వంపై నమ్మకం లేకనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు క్రాంతి, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు. 

 మేయర్ మహిళ కావాలని కోరుకుంటున్నా
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం డివిజన్లు కేటాయించడం సీఎం కేసీఆర్ ఘనతే. మహిళలు పదవుల్లో ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ మేయర్‌గా మహిళ కావాలని కోరుకుంటున్నా. గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. నగరంలో కరెంట్, నీటి బకాయిలు మాఫీ చేసిన ఘనత మాదే. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో చైతన్యపరుస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement