కాయతొలుచు పురుగుపై యుద్ధం
సాక్షి, హైదరాబాద్: కొన్ని జిల్లాల్లో పత్తికి సోకిన గులాబీ రంగు కాయతొలుచు పురుగుపై వ్యవసాయ శాఖ యుద్ధం ప్రకటించింది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో గులాబీ రంగు పురుగు కనిపించడంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపింది. ఇతర ప్రాంతాలకు, సమీప పంటలకు ఇది సోకకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు నిఫుణుల బృందాలు వెళ్లినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. కరపత్రాలు, గోడ పత్రికలు తయారు చేసి విరివిగా ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పురుగు విస్తరించకుండా నిలువరించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 86.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి. అందులో పత్తి విస్తీర్ణమే 44.72 లక్షల ఎకరాలు. ఇంత పెద్ద ఎత్తున పత్తి సాగు కావడం, మరోవైపు గులాబీ రంగు పురుగు ఆశించడంతో వ్యవసాయ శాఖ వర్గాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
డ్రైస్పెల్‌తో గులాబీ పురుగు..
మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకూ వేసిన పత్తిని గులాబీ రంగు పురుగు పీడిస్తోంది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో ముందుగా వేసిన పత్తి పంటపై గులాబీ పురుగు దాడి చేస్తోందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా నిర్థారించింది. ఇది ఆందోళనకరంగా పరిణమించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని అంటున్నారు. దీనివల్ల అనేకచోట్ల పత్తి పంట ప్రశ్నార్థకంగా మారింది. వారం క్రితం వరకు వర్షాలు రాకపోవడం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండలతో వాడిపోయే దశలో ఉండటం వల్ల పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేసిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతేడాది గుజరాత్‌లో గులాబీ రంగు పురుగు వల్లే లక్షలాది ఎకరాల్లో పత్తి నాశనమైంది.
ఒక సమయంలో ఉత్తర భారతంలోని రైతులను తీవ్రంగా వణికించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పురుగు విస్తరించకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ఆ ప్రకారం సమగ్ర నివారణ చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించడంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. బీటీ టెక్నాలజీ విఫలమైనందునే బీటీ–2 పత్తి విత్తనం గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయిందని వ్యవసాయరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.
శాస్త్రవేత్తల సూచనలివీ..
పత్తిని గులాబీ రంగు పురుగు నుంచి రక్షించుకోవడానికి కింది యాజమాన్య పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. అవేంటంటే..
► పంట 45 రోజుల వయస్సు ఉన్నప్పుడు లేదా పూత దశలో ఉన్నప్పుడు ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి.
► లింగాకర్షక బుట్టల్లోని ఎరను ప్రతీ 21 రోజులకోసారి విధిగా మార్చాలి.
► ఫిరమోన్ కెమికల్స్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన లింగాకర్షక బుట్టలు, ఎరలను వాడాలి.
► గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలను ఏరి నాశనం చేయాలి.
► పత్తి పంట చుట్టూ బెండగాని, తుత్తురు బెండగాని లేకుండా చూసుకోవాలి.
► దీంతోపాటు శాస్త్రవేత్తల సూచనల మేరకు పలు పురుగు మందులను పిచికారి చేయాలి.