
మన చమురు ఎందుకు వదిలించుకోవాలి!
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీని కాదని పోటీ చేస్తే మన చమురు వదులుద్ది, అదే బీజేపీ పోటీ చేస్తే ఆ బాధ ఉండదు...వచ్చేదేదో మనకూ కొంత వస్తుంది అని తెలుగుదేశం వేసిన ప్లాన్ బాగానే పని చేసింది. గెలుస్తామన్న భరోసా లేని చోట పోటీ ఎందుకు అనుకున్నారో ఏమో టీడీపీ వాళ్లు, బయటకు పోటీ చేస్తామని బడాయి, లోలోపల మనకెందుకు లెమ్మని ఊరడింపులు...ఇలా ఎట్టకేలకు బీజేపీ ఓ ఎన్‌ఆర్‌ఐని రంగంలోకి దించింది.
ఆ అభ్యర్థి వరంగల్ వెళ్లి నామినేషన్ వేయడానికి ముందే టీడీపీ నేత ఒకాయన ఫోన్ చేసి ఓ పాతిక లక్షలు సర్దుబాటు చేస్తే నామినేషన్ కార్యక్రమానికి పాతిక వేల మంది కార్యకర్తలు వచ్చేలా చూస్తామని అన్నారట. నామినేషన్ వేయకముందే ఇదేం గోలరా బాబూ అని పాతిక వేల మంది వద్దు... మీరు వస్తే చాలు నామినేషన్ కార్యక్రమానికి అని అభ్యర్థి చెప్పాడట. ఇప్పుడే ఇలా అంటే ఇక ప్రచారంలో ఎలా ఉంటుందో...చమురు వస్తేనే ప్రచారం లేదంటే...అంతే...హాయిగా తడిబట్ట వేసుకుని పడుకోక మనకెందుకు చింత అంటున్నాడిప్పుడా నేత.