♦ అడుగడుగునా పారిశుద్ధ్య లోపం
♦ నగరమంతా చెత్త కుప్పల మయం
♦ ఏటా రూ.కోట్లలో వ్యయం
♦ తప్పుడు లెక్కలతో నిధులు మాయం
‘విశ్వ’మంత ఎదగాలని ఆశ... ప్రగతి దిశగా పరుగులు పెట్టాలనే ధ్యాస.. వాస్తవ పరిస్థితులు చూస్తే నిలువెల్లా నిరాశ. ఆశలు...ఆకాంక్షలు అన్నీ కాగితాలకే పరిమితం. అసలు చిత్రం... అత్యంత ఘోరం. ముఖ్యంగా పారిశుద్ధ్య పరిస్థితులు ఎంత ‘చెత్త’గా ఉన్నాయో చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నీరులా ఖర్చవుతున్న నిధులు...మురికి కూపాల్లా వీధులు... ఎక్కడికక్కడ కొండల్లా చెత్త కుప్పలు... నెలల తరబడి కదలని డంపర్ బిన్లు... దుర్గంధం వెదజల్లే పరిసరాలు... భాగ్యనగరిని వేధిస్తున్నాయి. అభివృద్ధి వైపు పడుతున్న అడుగులకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నాయి. నిర్వహణ... వ్యాధుల నివారణకు ఏటా రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు.. అంటు వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు వైద్యులను సైతం పారిశుద్ధ్య సేవలకు వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంటోంది.
నగరంలో ఎక్కడ చూసినా కొండలను తలపించేలా చెత్తకుప్పలు, సకాలంలో డంపర్‌బిన్‌లను (పెద్ద చెత్త డబ్బాలు) డంపింగ్ యార్డులకు తరలించడం లేదు. వాటిలో నిండిన చెత్త కిందపడుతోంది. పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులు.. వీఐపీల మార్గాలు మినహాయిస్తే.. అంతర్గత రోడ్లు, కాలనీలు, బస్తీల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతోంది. ఇక చినుకులు పడితే అంతే సంగతులు. పరిసరాల ప్రజలు రోజుల తరబడి దుర్వాసన మధ్య గడపాల్సిందే. దోమలు.. ఈగల మధ్య రోగాలతో గడపాల్సిందే.
ఏటా రూ.కోట్లలో వ్యయం
పారిశుద్ధ్య కార్యక్రమాలకు జీహెచ్‌ఎంసీలో ఏటా సుమారు రూ.300 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇక పండుగలు, పబ్బాలు, ప్రత్యేక రోజుల పేరిట అదనపు షిప్టులు, వాహనాలకు మరికొన్ని నిధులు ఖర్చవుతున్నాయి. పరిస్థితి మాత్రం మారడం లేదు. వివిధ కూడళ్లు, ప్రధాన మార్గాల్లోని డంపర్‌బిన్లు నగర ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. వీటికి ఏటా రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు.
మరమ్మతులకు గురైన వాటిని ఎప్పటికప్పుడు బాగు చేయించకపోవడంతో పనికిరాకుండా పోతున్నాయి. మరోవైపు ఇళ్ల నుంచి చెత్తను డంపర్‌బిన్ల దాకా తీసుకు వచ్చేందుకు పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సినన్ని రిక్షాలు కూడా లేవు. నగరంలో దాదాపు 5600 రిక్షాలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం మరమ్మతులకు గురై పనికిరాకుండా పోయాయి.
భారీ వాహనాలు
డంపర్‌బిన్ల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చెత్తను తరలించేందుకు మొత్తం 564 వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిలో 458 జీహెచ్‌ఎంసీవి కాగా, 106 అద్దెకు వినియోగిస్తున్నారు.
సగమే పరిశుభ్రం
గ్రేటర్‌లో దాదాపు 8 వేల కి.మీ.ల రహదారులు ఉన్నాయి. వీఐపీల మార్గాలు.. వారు ప్రయాణించే రహదారులు అంటే దాదాపు 2 వేల కి.మీ.ల మేర మాత్రం పనులు సవ్యంగా చేస్తున్నారు. మిగతా ప్రాంతాలను గాలికొదిలేస్తున్నారు. దాదాపు 50 శాతం నగరంలో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి.
కాగితాలపైనే సిబ్బంది లెక్క
పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో ఏడుగురు సభ్యులు ఉంటున్నట్టు రికార్డుల్లో చూపుతున్నారు. క్షేత్ర స్థాయిలో నలుగురైదుగురు మాత్రమే పని చేస్తున్నారు. ఇలా దాదాపు 5 వేల మంది పని చేయకుండానే జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ విభాగం బాధ్యతలు పర్యవేక్షించినప్పుడు ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం బట్టబయలైంది. అప్పట్లో గ్రూపునకు 18 మందికి గాను కేవలం 12 మంది వంతున పనుల్లో ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఆ సంఖ్యను ఏడుకు పరిమితం చేశారు.
అయినా తీరు మారలేదు. ఏడుగురి స్థానే ఐదుగురుఉంటున్నారు. మిగతా కార్మికుల సొమ్మును దిగమింగుతున్న వారిలో ఏఎంఓహెచ్‌లు, సూపర్‌వైజర్లు, యూనియన్ నేతలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కార్పొరేటర్లు కూడా ఉండేవారు. ప్రస్తుతం పాలక మండలి లేకపోవడంతో ప్రస్తుతం వారు లేరని తెలుస్తోంది. అయినప్పటికీ, మాజీ కార్పొరేటర్లు కొందరు ఇంకా తమ వాటాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వనగరంలో ఇలాగేనా?
విశ్వనగరంలో భాగంగా గ్రేటర్‌ను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు అటు ప్రభుత్వం, ఇటు స్పెషలాఫీసర్ శ్రద్ధ చూపుతున్నారు. కానీ దిగువ స్థాయిలో అవకతవకలతో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతోంది. ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే పరిస్థితులు మెరుగుపడతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే తరుణంలో అవకతవకలకూ అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు.
ఏదీ చెత్తశుద్ధి?
Published Fri, Apr 10 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM
Advertisement