కాపు సంఘాల జేఏసీ .. ముద్రగడ దీక్షకు సంఘీభావం
నేటి నుంచి హైదరాబాద్‌లో దీక్షలు
సాక్షి, హైదరాబాద్: కాపుల్ని బీసీల్లో చేర్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ్ కమిషన్‌పై తమకు నమ్మకం లేదని కాపు సంఘాల సంయుక్త కార్యాచరణ సంఘం (కేజేఏసీ) ప్రకటించింది. మంజునాథ్ గతమంతా వివాదాస్పదమేనని ఆరోపించింది. ఆయన నాయకత్వంలో కాపులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదంది. ఈ వ్యవహారమై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. జంటనగరాల కాపు సంఘాల కన్వీనర్ కఠారి అప్పారావు అధ్యక్షతన శనివారంజరిగిన కేజేఏసీ సమావేశానికి వివిధ కాపు సంఘాల నేతలు పర్సా పరమేశ్వరరావు, బైరా దిలీప్, ఇక్కుర్తి నరేశ్, కేవీవీ సత్యనారాయణ, దుర్గారావు, డీవీరావు, సి.శేషయ్య, పి.వి.రామమోహననాయుడు తదితరులు హాజరయ్యారు.
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో మంజునాథ్ అనేక వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉందని సమావేశం అభిప్రాయపడింది. మంజునాథ్ కమిషన్ కాపులకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే తమ బతుకు ఛిద్రమవుతుందని, ఆయన్ను మార్చాలని కోరుతూ గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. ముద్రగడ పద్మనాభం దంపతులు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా ఆదివారం నుంచి హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని తీర్మానించింది. తాము బీసీల వాటాలో కోటా అడగడం లేదని స్పష్టం చేస్తూ ప్రతి జిల్లాలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది.
మంజునాథ్‌పై మాకు నమ్మకం లేదు!
Published Sun, Feb 7 2016 2:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement